పూలు దేవతలైన వేళ..

ABN , First Publish Date - 2021-10-07T05:56:47+05:30 IST

తీరొక్క పూలతో.. కోటొక్క పాటలతో బుధవారం తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుక సందడిగా జరిగింది. పల్లెలు, పట్టణాల్లోని మహిళలు నిష్టగా, సంప్రదాయబద్దంగా ఆడే తొ మ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి.

పూలు దేవతలైన వేళ..

ఘనంగా మొదలైన బతుకమ్మ పర్వం 

తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ సందడి

ఆటపాటలతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు 

కిటకిటలాడిన కాశీవిశ్వేశ్వరాలయ ఆవరణ

ఉత్సాహంగా బతుకమ్మ పాటల పోటీలు 


హనుమకొండ కల్చరల్‌/వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 6: తీరొక్క పూలతో.. కోటొక్క పాటలతో  బుధవారం తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుక సందడిగా జరిగింది. పల్లెలు, పట్టణాల్లోని మహిళలు నిష్టగా, సంప్రదాయబద్దంగా ఆడే తొ మ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. వీధి వీధి న ఆడపడుచుల సందడి.. ఏ వాకిలి చూసినా పూలవనాలు.. ఏ వైపు విన్నా ఉయ్యాల పాటలు.. వెరసి రంగు రంగుల పూలతో దారులన్నీ సింగిడిని తలపింపచేశాయి. బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలు, పిల్లలు, వృద్ధులతో కిటకిటలాడాయి. పండుగ కోసం పుట్టిళ్లు చేరిన ఆడపడుచులతో, చదువు, ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరంగా వెళ్లిన వారి రాకతో ప్రతి ఇంటా కోలాహరం మొదలైంది. ఎంగిలిపూలతో ప్రారంభమైన ఈ వేడుక తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.


శ్రద్ధగా..

మహిళలు ఉదయమే ఇంట్లో తమ ఇష్టదైవాన్ని పూజించారు. అనంతరం మార్కెట్లో కొని తెచ్చిన తంగేడు, కట్ల, గునుగు తదితర పూలతో బతుకమ్మలను  శ్రద్ధగా పేర్చారు. మహిళలు తమ అభిరుచి, స్థాయిని బట్టి వివిధ ఎత్తుల్లో ఎంతో ఆకర్శణీయంగా బతుకమ్మలను సిద్ధం చేసుకున్నారు. పూలతో బతుకమ్మను పేర్చడంలో తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రతీ ఇంట్లో రెండేసి చొప్పున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ తయారు చేశారు. వాటిని పూజ గదిలో  ఉంచి ప్రత్యేకంగా పూజలు చేశారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు లేదా బియ్యం, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. సాయంత్రం నూతన వస్త్రాలను ధరించి, అందంగా ముస్తాబై బతుకమ్మలను చేబూని ఆలయాలకు బయలు దేరారు. మహిళలంతా ఒక్కసారిగా బతుకమ్మలతో ఇళ్లనుంచి బయటకు రావడంతో ఊరూ, వాడ పూలవనంగా మారింది.


వేయిస్తంభాల గుడిలో..

తొలిరోజు బతుకమ్మ సంబరాలకు హనుమకొండలోని సుప్రసిద్ధ వేయిస్తంభాల గుడి ప్రాంగణం ప్రధాన వేదిక అయింది. హనుమకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వేలాదిమంది మహిళలు ఈ ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో గుంపులు, గుంపులుగా చేరి తమ వెంట తీసుకువచ్చిన బతుకమ్మలన్నిటినీ ఒక దగ్గర చేర్చారు. వాటి చుట్టూ తిరుగుతూ ఉయ్యాల పాటలు పాడారు. కొందరు మహిళలు కోలాటం ఆడారు. రాత్రి 8గంటల వరకు ఆట పాటలతో ఆ ప్రాంతం మారుమోగింది. రాధేశ్యామ్‌ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ జానపద, భక్తి గేయాల పోటీలను నిర్వహించారు. సాయంత్రం 7గంటలకు పాట పోటీలను నిర్వహించారు. బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలకు ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ స్వాగతం పలికారు. హనుమకొండలోని పెద్దకోవెల, ఏకశిల పార్క్‌లోని సీతారామాంజనేయ స్వామి ఆలయం, రెవెన్యూ కాలనీలోని సీతారామా ఆలయం, ఎక్సైజ్‌కాలనీలోని  వెంకటేశ్వరస్వామి ఆలయం వికా్‌సనగర్‌లోని కోదండ రామాలయం, పరిమళకాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయం, వడ్డెపెల్లి చెరువు కట్టమీద ఉన్న రామలింగేశ్వరాలయంతో పాటు పలు ఇతర ఆలయాల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలను ఆడారు. పాడారు.


ఉత్సాహంగా..

కిందటేడు కరోనా భయంవల్ల బతుకమ్మ సంబురాలు అంతగా జరగలేదు. మహిళలు పరిమితస్థాయిలో ఇళ్లు, అపార్టుమెంట్లలోనే జరుపుకున్నారు. కానీ ఈసారి కరోనా భయం లేకపోవడంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా అందరు పాల్గొన్నారు. అపార్టుమెంట్లలో పెద్ద ఎత్తున జరుపుకున్నారు. వరంగల్‌ మహానగరంలోని దాదాపు అన్ని అపార్టుమెంట్లలోని సెల్లార్లన్నీ బతుకమ్మ ఆట, పాటలకు వేదికలయ్యాయి. ఇందుకోసం ఆపార్టుమెంట్ల వెల్పేర్‌ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించాయి. మైకులను ఏర్పాటు చేశాయి. అపార్ట్‌మెంట్లలో మహిళలు బతుకమ్మలను ఆడిన తర్వాత వాటిని సమీపంలోని ఆలయాలకు తీసుకువెళ్లి అక్కడ చెట్ల కింద వదిలేసి వచ్చారు.


బందోబస్తు

బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిమంది మహిళలు బతుకమ్మలతో తరలిరావడంతో ఎలాంటి రద్దీ, తొక్కిసలాట ఏర్పడకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన రహదారుల వెంట ముఖ్య కూడళ్లలో పోలీసు పికెటింగ్‌లను ఉంచారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా కొన్నిచోట్ల వన్‌వే పెట్టారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా, మాస్క్‌లు విధిగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. 


వరంగల్‌లో..

వరంగల్‌ కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం,  ఖిలా వరంగల్‌ కోట, రంగశాయిపేట మైదానం, కరీమాబాద్‌, ఉర్సు, ఓసిటీ రామలింగేశ్వర దేవాలయం, రామన్నపేటలోని మోక్షారామం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అమ్మఒడి ప్రాంగణం, దుర్గేశ్వరాలయం, గిర్మాజీపేట, పోచమ్మమైదాన్‌, కొత్తవాడ, బ్యాంక్‌ కాలనీ, మట్టెవాడ, పెరుకవాడ, శివనగర్‌, దేశాయిపేట, బట్టలబజార్‌ వెంకటేశ్వరాలయం, ఆకారపువారి వీధి, మామునూరుతో పాటు నగరంలోని పలు ఆలయాలు, మైదానాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడారు.  డివిజన్‌ కేంద్రాలైన నర్సంపేట, వర్ధన్నపేటతోపాటు నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపూర్‌, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుగొండ, సంగెం, రాయపర్తి, పర్వతగిరి, ఖిలా వరంగల్‌, వరంగల్‌ మండల కేంద్రాలు, గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 



















Updated Date - 2021-10-07T05:56:47+05:30 IST