పోడు భూములు, గిరిజనుల కోసం జైలుకైనా సిద్ధం

ABN , First Publish Date - 2021-03-06T05:14:11+05:30 IST

పోడు భూములు, గిరిజనుల కోసం జైలుకైనా సిద్ధం

పోడు భూములు, గిరిజనుల కోసం జైలుకైనా సిద్ధం
మాట్లాడుతున్న బండి సంజయ్‌

గట్టమ్మను అడిగినా.. కేసీఆర్‌ పీడ పోవాలని..

పోయేటప్పుడు ములుగు మట్టి తీసుకుపోతా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ములుగులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ

ములుగు, మార్చి 5 : పోడు భూములకు హక్కుపత్రాలు, గిరిజనులకు రిజర్వేషన్‌ సాధన కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ యుద్ధం చేస్తోందని, యువత భాగస్వాములు కావాలన్నారు. ములుగుకు రాంగ గట్టమ్మను దర్శించుకున్నా.. తల్లి పాదాల దగ్గర తల ఆనించి అడిగిన.. రాష్ర్టానికి పట్టిన కేసీఆర్‌ పీడను వదిలించమని.. ములుగోళ్లు అధృష్టవంతులు.. సమ్మక్క-సారలమ్మలు పుట్టిన నేలపైపుట్టి పుణ్యం చేసుకున్నరు.. పోరాటాలు నేర్పిన ఈగడ్డ మట్టిని పోయేటప్పుడు తీసుకుపోతా.. రోజూ నుదుడికి పెట్టుకుంటా.. అని అన్నారు. 

 రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు వెంటిలెటర్‌పై ఉందని, ఎప్పుడు కూలుతుందో తెలియదని అన్నారు. మేధావులు, పట్టభద్రులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మూడెకరాల భూమి ఇవ్వకున్నా ఫరవాలేదు కానీ, పోడుభూముల్లో మొక్కలు నాటి గిరిజనుల బతుకుదెరువును లాక్కోవద్దని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి లేదు.. ఖాళీల భర్తీలేదు.. పీఆర్‌సీ లేనేలేదు.. కాంట్రాక్టు కార్మికులే ఉండరు.. అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి ఉన్న పోస్టులు పీకేసిండు.. అని అన్నారు. ములుగు జిల్లాలో టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు, జాతీయరహదారుల అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందలాది కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. 

మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ములుగును అన్ని రంగాల్లో ప్రగతిగా నిలుపుతామన్నారు. తెలంగాణ కళాకారుడు దరువు ఎల్లన్న బృందం ఆటపాట ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు సంజయ్‌కి నాగలిని బహుకరించడంతోపాటు గజమాల, శాలువాలతో సత్కరించారు. బిల్ట్‌ కార్మిక జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకే్‌షరెడ్డి, గిరిజనమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, జగన్నాయక్‌, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌, క్రిష్ణవేణినాయక్‌, తాటి కృష్ణ, తక్కళ్లపల్లి దేవేందర్‌రావు, సూరపనేని వెంకటసురేష్‌, గాజుల కృష్ణ, కొత్త దశరథం, రమేష్‌, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

 ముఖ్యనాయకులతో బండి సమీక్ష

ములుగుకు చేరుకున్న బండి సంజయ్‌ గంటపాటు బీజేపీ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ ప్రభావం, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సరళి, ఇక్కడి ప్రధాన సమస్యలు, ప్రజల డిమాండ్‌.. తదితర అంశాలపై చర్చించారు. ములుగు జిల్లాకు సుపరిచితుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి స్థానిక డిమాండ్‌లను బండికి వివరించారు.

Updated Date - 2021-03-06T05:14:11+05:30 IST