టీఆర్ఎస్ ‘ట్రబుల్’ షూటర్‌కు ఏమైంది..? హరీశ్ అంచనాలు తలకిందులు అవడం వెనుక..

ABN , First Publish Date - 2021-11-02T23:32:04+05:30 IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు.. టీఆర్ఎస్‌కు గట్టి గుణపాఠాన్నే నేర్పాయని చెప్పవచ్చు. ఇటీవల తరచూ ఎదురు దెబ్బలు తింటున్న టీఆర్ఎస్‌కు.. మళ్లీ ఈటల రూపంలో గట్టి షాక్ తగిలింది.

టీఆర్ఎస్ ‘ట్రబుల్’ షూటర్‌కు ఏమైంది..? హరీశ్ అంచనాలు తలకిందులు అవడం వెనుక..

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు.. టీఆర్ఎస్‌కు గట్టి గుణపాఠాన్నే నేర్పాయని చెప్పవచ్చు. ఇటీవల తరచూ ఎదురు దెబ్బలు తింటున్న టీఆర్ఎస్‌కు.. మళ్లీ ఈటల రూపంలో గట్టి షాక్ తగిలింది. పరాభవం అనే మాట ఎరుగని టీఆర్ఎస్ విజయయాత్రకు క్రమంగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. అయితే క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ఆదుకుంటూ, తన రాజకీయ చతురతతో టీఆర్ఎస్ విజయంలో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్న హరీశ్‌రావు ప్రయత్నాలు కూడా ఇటీవల బెడిసి కొడుతున్నాయి. గతంలో అంతా తానై పార్టీని తన భుజస్కంధాలపై ఉంచుకుని నడిపించిన హరీశ్‌రావుకు ట్రబుల్ షూటర్ అని పేరుంది. అయితే ఇంతటి రాజకీయ చతురత ఉన్న హరీశ్‌రావు.. హుజూరాబాద్‌లో విషయంలో మాత్రం వెనుకబడ్డారు.


హుజూరాబాద్ ఉప ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయి. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే సాగింది. అయితే ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించి.. కేసీఆర్, కేటీఆర్ ప్రచారానికి వెళ్లలేదనే చర్చ నడుస్తోంది. హుజూరాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని చెప్పిన మంత్రి హరీశ్‌రావు అంచనాలు తలకిందులయ్యాయి. అయితే ఆయన ప్రచారం వల్లే టీఆర్ఎస్‌కు ఆమాత్రమైనా ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. వివిధ ప్రయత్నాలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ఆఖరికి హుజూరాబాద్‌కు ప్రత్యేకంగా దళితబంధు పథకాన్ని కూడా వర్తింపజేశారు. అయినా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 


హుజూరాబాద్‌ ఫలితాల్లో బీజేపీ కంటే ఈటలకు ఉన్న ఇమేజే.. ఉత్తమ ఫలితాలకు కారణమైందనే వాదన నడుస్తోంది. హుజూరాబాద్‌ నియోజగవర్గంలో 6 దఫాల ఎన్నికలలో వరుసగా టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తూ వచ్చింది. అందులో ఈటెల నాలుగు సార్లు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేయగా కేవలం 1683 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. 2004లో జరిగిన హుజూరాబాద్ శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి చెందిన కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు తన ప్రత్యర్థి అయిన.. టీడీపీ అభ్యర్థి పెద్దిరెడ్డిపై 44,669 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల వరుసగా 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టీఆర్‌ఎస్ నుంచి ఈటల బయటికొచ్చిన తర్వాత నుంచి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.


హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదటి నుంచీ బీజేపీ బలం నామమాత్రమే ఉంటూ వస్తోంది. అయితే ఈటల చేరికతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా పెరిగిందని చెప్పొచ్చు. దీంతో బీజేపీ కంటే ఈటలను చూసే ఓట్లు వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎట్టకేలకు, వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీఆర్ఎస్‌కు గత ఏడాది నవంబర్‌లో దుబ్బాక ఎన్నికల రూపంలో బ్రేకులు పడడం, ఈ ఏడాది మళ్లీ హుజూరాబాద్ ఉప ఎన్నికల రూపంలో గట్టి దెబ్బే తగిలింది. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్‌లో అంతర్మథనం మొదలైంది. ఎక్కడ లోపం ఉంది, దేనివల్ల ఇలా జరుగుతోంది అనే అంశాలపై కసరత్తు ప్రారంభమైంది.

Updated Date - 2021-11-02T23:32:04+05:30 IST