అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా

ABN , First Publish Date - 2021-11-26T09:32:05+05:30 IST

శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెగ్యులర్‌ వైద్య పరీక్షల్లో భాగంగా..

అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా

  • హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిక
  • ఇటీవల తనను కలిసినవారు టెస్టు 
  • చేయించుకోవాలని సూచన
  • 4 రోజుల క్రితం మనవరాలి పెళ్లి
  • హాజరైన 2 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25: శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెగ్యులర్‌ వైద్య పరీక్షల్లో భాగంగా.. బుధవారం రాత్రి ఆయన టెస్టు చేయించుకోగా కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. శ్రీనివాసరెడ్డి ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, తనకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు లేనప్పటికీ వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్లు స్పీకర్‌ తెలిపారు. మరోవైపు గత ఆదివారం హైదరాబాద్‌ శివారులో స్పీకర్‌ పోచారం మనువరాలి వివాహం ఘనంగా జరిగింది. ఆ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ సహా ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. సీఎంలు అరగంటపైగా వేడుకలో గడిపారు. శ్రీనివాసరెడ్డి సైతం వారితో సన్నిహితంగా మెలిగారు. సీఎంల భోజన సమయంలోనూ ఆయన వారివెంటే ఉన్నారు. కాగా, కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో.. ఇటీవల తనతో  సన్నిహితంగా ఉన్నవారు టెస్టు చేయించుకోవాలని పోచారం సూచించారు.


చింతకాని పాఠశాలలో మరో ఆరుగురు విద్యార్థులకు..

ఖమ్మం జిల్లా చింతకాని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో ఆరుగురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. బుధవారం ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ  అయింది. కాగా, రాష్ట్రంలో గురువారం 33,836 మందికి పరీక్షలు చేయగా 147 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరొకరు చనిపోయారు.

Updated Date - 2021-11-26T09:32:05+05:30 IST