పిల్లలు పుట్టినా ‘కల్యాణ లక్ష్మి’ రావట్లే!
ABN , First Publish Date - 2021-11-26T09:51:49+05:30 IST
ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేదలకు ఆశించిన స్థాయిలో ఆసరాగా నిలవడం లేదు.

- పెండింగ్‌లో లక్షకుపైగానే దరఖాస్తులు..
- ఏడాది దాటినా అందని సాయం..
- లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు
- అందాల్సిన మొత్తం రూ.వెయ్యి కోట్లపైనే
- ఎట్టకేలకు రూ.462.50 కోట్లు విడుదల
- వీటితో సగం మందికీ ఇవ్వలేని పరిస్థితి
హైదరాబాద్, నవంబంరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేదలకు ఆశించిన స్థాయిలో ఆసరాగా నిలవడం లేదు. ఆయా పథకాల కింద డబ్బులు వస్తాయనే ధైర్యంతో అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్న నిరుపేద కుటుంబాలు ఆ తర్వాత నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సమయానికి ఆర్థిక సాయం అందకపోవడంతో తెచ్చిన వివిధ కారణాల వల్ల ఇప్పటికే 1,09,027 దరఖాస్తులు పెడింగ్‌లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం అన్ని ధ్రువపత్రాలతో పెళ్లి జరిగిన ఆరు నెలల వ్యవధిలో లబ్ధిదారులు ఎప్పుడైనా కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవ చ్చు. గరిష్ఠంగా నెల రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంటుంది. కానీ నిధుల కొరత, దరఖాస్తుల పరిశీలన లో జాప్యం కారణంగా పెళ్లి జరిగి ఏడాది గడిచినా చా లా మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. కొందరు జంటలకు పిల్లలు పుట్టిన తర్వాత కూ డా కల్యాణ లక్ష్మి అందని పరిస్థితి నెలకొంది.
నిధుల విడుదల అంతంతే..
కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి రూ.462.50 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పెండింగ్‌లో ఉన్న లక్షకుపై గా దరఖాస్తులకు సాయం అందించాలంటే సుమారు రూ.1000కోట్లపైనే నిధుల అవసరం ఉండగా.. అందులో సగం కూడా విడుదల చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాంకేతిక సమస్యలు
హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన ఓ కు టుంబం కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకుంది. మీ-సే వా కేంద్రంలో అన్ని వివరాలు నమోదు చేసి ఒకటికి పదిసార్లు సరిచూసుకుని సబ్మిట్ చేశారు. రోజులు, నెలలు గడుస్తున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆన్లైన్లో స్టేటస్ చెక్చేస్తే అప్లికేషన్ పెండింగ్ చూపిస్తోంది. అదేమిటని ఆరా తీస్తే సాంకేతిక సమస్య కారణంగా ఆ దరఖాస్తు వేరే జిల్లాకు వెళ్లిపోయి.. తహసీల్దార్ కార్యాలయంలో నాన్ ట్రేసింగ్గా మిగిలిపోయిం ది. సమస్య ఎక్కడుందో తెలుసుకున్నాక కానీ.. ఆ దరఖాస్తుకు మోక్షం ల భించలేదు.చాలా మం ది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిన్‌కోడ్ కరెక్ట్‌గా ఉన్నా దానికి సంబంధించిన జిల్లా మాత్రం సర్వర్ తీసుకున్న డాక్యుమెంట్స్‌లో కనిపించడం లేదు. దీంతో ఒక మండల అధికారికి వెళ్లాల్సిన అప్లికేషన్ మరో మండలానికి వెళ్తోంది. ఆన్లైన్లో మాత్రం అ ప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తోంది. దీంతో లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చక్క ర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఎమ్మెల్యే ఓకే చేస్తేనే...
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తుపై డిప్యూటీ తహసీల్దార్ విచారణ జరిపి అర్హులైన వారి దరఖాస్తులను తహసీల్దార్‌కు పంపి తే లబ్ధిదారులుగా గుర్తించి ఆమోదం తెలుపుతారు. సదరు ప్రొసీడింగ్ ఉత్తర్వుల్ని స్థానిక ఎమ్మెల్యే మరో సారి పరిశీలించి తుది జాబితాను ఆర్డీవోకు సూచిస్తారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఆఫీసులో పేరు ఓకే చేయించుకునేందుకు లబ్ధిదారులు కచ్చితంగా మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. చివరకు చోటా, మోటా నాయకుడి చుట్టూ తిరిగి ఆయన ద్వారా ఎమ్మెల్యేను చేరుకుని తుది జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకునేందుకు నిరుపేద కుటుంబాలు పడరాని పాట్లు పడుతున్నాయి.