జీతాలపెంపు లేనట్లే!

ABN , First Publish Date - 2021-05-18T07:43:18+05:30 IST

ఉద్యోగులకు ఈ నెలలో కూడా వేతనాలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. అంటే జూన్‌ 1న తీసుకునే జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదన్నమాట.

జీతాలపెంపు  లేనట్లే!

ఇంకా జారీ కాని ఉత్తర్వులు ఈ నెలకూ పాత వేతనాలే!

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు ఈ నెలలో కూడా వేతనాలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. అంటే జూన్‌ 1న తీసుకునే జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదన్నమాట. వేతనాల్లో పెరుగుదల కోసం ఉద్యోగులు మరో నెల ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన జీతాలను ఏప్రిల్‌ నుంచి వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. అంటే.. మే 1న తీసుకునే జీతాన్ని పెంచి చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో సీఎం కేసీఆర్‌కు కరోనా వైరస్‌ సోకడం వంటి కారణాలతో ఉద్యోగుల జీతాల పెంపు నిర్ణయాన్ని అమలు చేయలేదు. దాంతో ఈ నెలలో అమల్లోకి వస్తుందని అంతా భావించారు. కానీ, ఈ నెలలో కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఫిట్‌మెంట్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం కూడా చేయలేదు. అలాగే ఈ అంశంపై ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటికే 17 రోజులు గడిచిపోయాయి. 


సాధారణంగా ఉద్యోగుల జీతాల బిల్లులను తయారు చేయడం, వాటిని ట్రెజరీలకు పంపడం వంటి పనులు 20 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి ఇప్పటి వరకూ ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో మే నెలకు సంబంధించి ఉద్యోగులకు పాత జీతాల బిల్లులను రూపొందిస్తున్నారు. అంటే జూన్‌లోనూ పాత వేతనాలే తీసుకోవాలి. ప్రస్తుతం కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌ అమల్లో ఉండడం వంటి కారణాలతో ఉద్యోగులు కూడా జీతాల పెంపుపై పట్టుబట్టే వీలు లేకుండా పోయింది.

Updated Date - 2021-05-18T07:43:18+05:30 IST