ఆరోగ్యశ్రీ బకాయిలు.. 700 కోట్లకు పైనే!

ABN , First Publish Date - 2021-10-07T06:59:03+05:30 IST

ఆరోగ్యశ్రీ అనుసంధానిత ప్రైవేటు ఆస్పత్రులకు సర్కారు చెల్లించాల్సిన బకాయిలు

ఆరోగ్యశ్రీ బకాయిలు.. 700   కోట్లకు   పైనే!

  • సర్కారు లెక్క రూ.160 కోట్లే
  • 99.42 కోట్లు ఇచ్చేశామంటోంది
  • రూపాయి కూడా ఇవ్వలేదంటున్నప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు
  • ఏటా పెరుగుతున్న ఆరోగ్యశ్రీ ఖర్చు 
  • ఏడేళ్లలో రూ.4138 కోట్ల చెల్లింపు
  • 11 లక్షల మంది రోగులకు చికిత్స


హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ అనుసంధానిత ప్రైవేటు ఆస్పత్రులకు సర్కారు చెల్లించాల్సిన బకాయిలు ఎన్ని? నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నట్టు రూ.700 కోట్లా? వైద్య ఆరోగ్యశాఖ వాదిస్తున్నట్టు రూ.160 కోట్లా? రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆశాదీపమైన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన బకాయిల విషయంలో ఇంత భారీ వైరుధ్యంతో ప్రకటనలు వెలువడటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు చెబుతున్న బకాయిల లెక్కకు.. వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాలకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.500 కోట్లకుపైగా తేడా ఉండటం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన బకాయి లెక్కలు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమర్పించే బిల్లులకు సంబంధించిన స్ర్కీనింగ్‌ ప్రక్రియేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


స్ర్కీనింగ్‌ దశలోనే వివిధ కొర్రీలతో బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో మొత్తం బిల్లులోకి ఆ నిధులు చేరడం లేదని అంటున్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు మాత్రం ఇలా వివిధ స్ర్కీనింగ్‌ దశల్లో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులను కూడా కలుపుకొని మొత్తం బకాయిలను ప్రకటించేస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర సర్కారు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల బకాయిల లెక్కల్లో భారీ వైరుధ్యం ఏర్పడుతోందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రైవేటు ఆస్పత్రుల్లో తెలంగాణవాసులు చికిత్స చేయించుకున్నది నామమాత్రంగానే. ఇక 2014-15లో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.294 కోట్లు చెల్లించగా, అది 2020-21 నాటికి రూ.513 కోట్లకు పెరిగింది. అలాగే ఈ పథకం కింద ఏటా ఒక్కో రోగికీ సగటున వెచ్చించే చికిత్స ఖర్చు కూడా పెరిగింది. కేన్సర్‌ చికిత్సకే రూ. 200 కోట్లు..

రాష్ట్రంలో ఏటా కేన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. 2020లో తెలంగాణలో 47620 కేన్సర్‌ కేసులుండగా.. మరో నాలుగేళ్లలో ఆ కేసుల సంఖ్య 11.1 శాతం పెరిగి 53,565కు చేరుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ కింద కేన్సర్‌ చికిత్సకు చెల్లిస్తున్న మొత్తం కూడా ఎక్కువగానే ఉంటోంది. అది ఏటా పెరుగుతోంది. గత ఏడేళ్లలో ఒక్క ప్రైవేటు ఆస్పత్రుల్లో కేన్సర్‌ రోగుల చికిత్సకే సర్కారు రూ. 200 కోట్ల వరకు చెల్లించింది.


హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి 2014-15లో ఆరోగ్యశ్రీ కింద కేన్సర్‌ రోగుల చికిత్సకు రూ. 11.38 కోట్లు చెల్తిస్తే, అది 2020-21 నాటికి రూ. 26.82 కోట్లకు పెరిగింది. అంటే ఏ స్థాయిలో కేన్సర్‌ రోగులు పెరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎంఎన్‌జేలో ఆరోగ్యశ్రీ కింద చెల్లించేవి కూడా కలుపుకొంటే ఆ మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 


ఏడు నెలలుగా రెగ్యులర్‌ చెల్లింపులేవి?

ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం గత ఏడు నెలలుగా రెగ్యులర్‌  బిల్లులు ఇవ్వడం లేదని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ.150 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిల కింద ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించారు. ఆ రూ. 150 కోట్లు కూడా పాత బకాయిలేనని ఆస్పత్రులు చెబుతున్నాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కేవలం రూ.99 కోట్లే ప్రభుత్వం చెల్లించింది. కానీ, ప్రతి నెలా ప్రైవేటు ఆస్పత్రుల్లో సగటున రూ. 100 కోట్లు ఆ పథకం కింద బిల్లులు జనరేట్‌ అవుతున్నాయి. వాస్తవానికి ఒక రోగి ఆస్పత్రిలో చేరి, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుంటే, అందుకు సంబంధించిన బిల్లును నెల రోజుల్లోగా ట్రస్టుకు సబ్మిట్‌ చేయాలి. ఆ రోగి తాలుకా బిల్లును ఆరోగ్యశ్రీ ట్రస్టు మూడు మాసాల్లోగా చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇది క్షేత్రస్థాయిలో ఏమాత్రం అమలు కావట్లేదు. 


రూ. 200 కోట్లు వచ్చినా... 

వారం క్రితం ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రూ.200 కోట్లు విడుదల అయ్యాయి. ఆ సొమ్మును ఆస్పత్రులకు బ్యాంకుల ద్వారా చెల్లించాలంటే ట్రస్టు సీఈవో అనుమతి కావాలి. ప్రస్తుతం సీఈవోగా వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉన్నారు. ఆయన బాగా బిజీగా ఉండటం వల్ల సంతకం చేయలేదని సమాచారం. దాంతో ఆ డబ్బులు అలాగే ట్రస్టులో ఉండిపోయాయి. రెగ్యులర్‌ సీఈవో ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని ఆస్పత్రులు చెబుతున్నాయి. 
ఆరోగ్యశ్రీ కింద ఏడేళ్లలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించిన మొత్తం 

(రూ.కోట్లలో)


సంవత్సరం ప్రైవేటు ప్రభుత్వ 

ఆస్పత్రులకు ఆస్పత్రులకు 

2014-15 294.9 95.26

2015-16 348.14 102.61

2016-17 466.29 151.34

2017-18 401.69 125.39

2018-19 441.51 161.55

2019-20 515.04 169.15

2020-21 513.77 203.02

2021-22 99.41 49.63

(25/9/21 వరకు)


Updated Date - 2021-10-07T06:59:03+05:30 IST