ఆర్నెల్లు ముందుగానే ఎన్నికలకు?
ABN , First Publish Date - 2021-12-26T08:24:56+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2023 ప్రథమార్థంలోనే ముందస్తు ఎన్నికలకు సన్నద్దమవుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తమ తమ పార్టీ అధిష్ఠానాలకు సమాచారం ఇవ్వడంతో రెండు పార్టీలు అందుకు సంసిద్దమవుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహంపై కాంగ్రెస్, బీజేపీ అప్రమత్తం
న్యూఢిల్లీ, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2023 ప్రథమార్థంలోనే ముందస్తు ఎన్నికలకు సన్నద్దమవుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తమ తమ పార్టీ అధిష్ఠానాలకు సమాచారం ఇవ్వడంతో రెండు పార్టీలు అందుకు సంసిద్దమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర నేతలు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినపుడు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. అదే విధంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ముందస్తు ఎన్నికల గురించి జరుగుతున్న చర్చను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తామని రెండు పార్టీల అధినేతలు తమ రాష్ట్ర నేతలకు చెప్పారని సమాచారం. నిజానికి 2019లోనే సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కేసీఆర్ కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్ర ఎన్నికలను ముందుగా జరిపించుకున్నారు. తాను గెలిచిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సహాయపడతానని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే కేంద్రం తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సహకరించిందని బీజేపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ప్లేటు ఫిరాయించి, కేంద్రానికి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్‌లను కలిశారని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు అనుకూలంగా ఎన్నికల తేదీలు ఉండరాదని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. మోదీ అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపాలని నిర్ణయించినా, జమిలి ఎన్నికల దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నా శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి వస్తాయని కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే 2023 ప్రథమార్థంలోనే ఆయన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో తమకు రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ, కాంగ్రెస్ రెండూ భావిస్తున్నాయి. బీజేపీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను తోసిపుచ్చడం లేదు. కేసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం నిర్మించాలంటే ఇప్పటి నుంచే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని, ముందుగా అభ్యర్థులను ఎంపిక చేసి రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.
కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వచ్చారని, అందులో భాగంగానే ధాన్యం కొనుగోలు అంశాన్ని ఉధృతంగా తెరపైకి తెచ్చారని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు కూడా అంతే తీవ్రంగా టీఆర్‌ఎస్ నేతలపై ఎదురు దాడులు ప్రారంభించారు. బీజేపీపై దాడిని ఎక్కుపెట్టడం ద్వారా కాంగ్రె్‌సను చర్చలో లేకుండా చేయాలని, కాంగ్రెస్ బలహీనపడితే బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా పట్టు లేదు కనుక టీఆర్‌ఎ్‌సకే రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్రనేత ఒకరు విశ్లేషించారు. కేసీఆర్-బీజేపీ మధ్య జరిగే వాద ప్రతివాదాల మధ్య కాంగ్రెస్ ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోలేని పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ గట్టి ప్రతివ్యూహాన్ని నిర్మించాల్సి ఉందని అన్నారు. ఇదే విషయం జాతీయ నాయకత్వంతో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు.