కేసీఆర్‌, కేటీఆర్‌ బియ్యం స్మగ్లర్లా?

ABN , First Publish Date - 2021-12-09T06:55:20+05:30 IST

ధాన్యం కొనుగోలుపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో కొట్లాడుతుంటే

కేసీఆర్‌, కేటీఆర్‌ బియ్యం స్మగ్లర్లా?

  • ఆ బీజేపీ ఎంపీ మనిషా? పశువా?.. మెదడు మోకాళ్లకేమైనా జారిందా?
  • బీజేపీ ఉడత ఊపులకు భయపడం.. ఢిల్లీ, గుజరాత్‌కు గులాంలు కాము
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. తొండి సంజయ్‌లా మారారు
  • పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి .. ఓ చిల్లర వ్యక్తి.. ఆయనవి చీప్‌ మాటలు
  • కేంద్రం తప్పిదం వల్లే ధాన్యం కొనుగోళ్ల సమస్య: కేటీఆర్‌
  •   టీఆర్‌ఎ్‌సలో చేరిన కాంగ్రెస్‌ నేత చలిమెడ లక్ష్మీనరసింహారావు

 

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలుపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో కొట్లాడుతుంటే కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన తెలంగాణ ఎంపీలు ఒక్కరు కూడా సంఘీభావం తెలపలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా తమ ఎంపీలపైనే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఒక బీజేపీ ఎంపీ మాట్లాడుతూ.. కేసీఆర్‌, కేటీఆర్‌ బియ్యం స్మగ్లర్లు అని అంటున్నారని, అసలు ఆయన మనిషా?.. పశువా?.. ఆయనను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఆయనకేమైనా మెదడు మోకాళ్లలకు జారిందా.. రాజకీయాలు చేసేది ఇలాగేనా?.. సాగు విస్తీర్ణం పెంచిన తమను బియ్యం స్మగ్లర్లు అంటారా? అని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చలిమెడ లక్ష్మీనరసింహారావు తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సెకట్రరీ జనరల్‌, ఎంపీ కె.కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్‌, పార్టీ నేతలు టి.భానుప్రసాదరావు, ఎల్‌.రమణ, కె.విద్యాసాగర్‌రావు, కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయించే చరిత్ర ఉన్న బీజేపీ ఉడత ఊపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దేశంలో మిగతా పార్టీల నాయకులు ఎవరైనా బీజేపీ భయపడుతారెమో కానీ.. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ భయపడరని అన్నారు. తాము ఢిల్లీ, గుజరాత్‌లకు గులాములం కాదని కాంగ్రెస్‌, బీజేపీలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలే తమ బాసులని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. తొండి సంజయ్‌లాగా మారారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ ఏం చేసిందని ఉద్యమకారులు ఆ పార్టీలో చేరతారని అన్నారు.


ఇక రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌ కాదని.. ఒక చిల్లర వ్యక్తి అని ధ్వజమెత్తారు. చాలా విషయాల్లో రేవంత్‌రెడ్డి చాలా చీప్‌గా మాట్లాడుతున్నారన్నారు. పిచ్చి పిచ్చి ప్రకటనలు చేయడమే ఆయనకు తెలిసిన విషయమని విమర్శించారు. గతంలోనూ సచివాలయంలో నేల మాళిగలు ఉన్నాయని మానసిక రోగిలా మాట్లాడారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదం వల్లనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య ఏర్పడిందన్నారు. కేంద్రం ఉప్పుడు బియ్యం కొనబోమని చెప్పడం వల్లనే ఈ సమస్య వచ్చిందని చెప్పారు.  కాంగ్రెస్‌తో సుమారు రెండున్నర దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న లక్ష్మీనరసింహారావును టీఆర్‌ఎ్‌సలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఆయన ముక్కుసూటి మనిషి అని కొనియాడారు. లక్ష్మీనరసింహారావు చేరికతో కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎ్‌సకు కొత్త శక్తి వస్తుందన్నారు.



జీడీపీలో తెలంగాణ వాటానే 5 శాతం

తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని గతంలో విమర్శించిన వాళ్లు కూడా నేడు ముక్కున వేలేసుకునేలా రాష్ట్రంలో పాలన చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పా రు. దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్రం వాటా ఐదు శాతం ఉందని, ఈ విషయాన్ని ఆర్‌బీఐ గణాంకాలే స్పష్టం చేశాయన్నారు. దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం లక్ష రూపాయలు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.    



ఆయనతో రాజకీయ విభేదాలే: గంగుల 

ఇప్పటిదాకా లక్ష్మీనరసింహారావుతో తనకున్నవి కేవలం రాజకీయ విభేదాలేనని మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. ఆయనకు తనతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఖండించారు.   



కేసీఆరే తెలంగాణ భవిష్యత్తు: చలిమెడ 

కాంగ్రెస్‌, టీడీపీలు 50 సంవత్సరాలలో సాధించని ప్రగతిని.. టీఆర్‌ఎస్‌ ఐదారేండ్లలో చేసి చూపిందని లక్ష్మీనరసింహారావు అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ లబ్ధి కోసం టీఆర్‌ఎ్‌సలోకి రావడం లేదని చెప్పారు. మంత్రి గంగులకు తనకు ఎటువంటి గొడవలు లేవన్నారు.  


Updated Date - 2021-12-09T06:55:20+05:30 IST