సారాయి వీర్రాజు!
ABN , First Publish Date - 2021-12-30T07:26:29+05:30 IST
‘తాము అధికారంలోకొస్తే రూ.50కే చీప్ లిక్కర్ బాటిల్ ఇస్తాం’ అంటూ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ సభలో చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా

- 50కే చీప్ లిక్కర్ ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
- వాట్ ఏ స్కీమ్.. వాట్ ఏ షేమ్ అంటూ కేటీఆర్ ట్వీట్
- షర్మిల, తృణమూల్ ఎంపీ కూడా ట్విటర్లో విమర్శలు
- దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న వీర్రాజు ‘చీప్’ వ్యాఖ్యలు
- ప్రత్యేక హోదా అయ్యయ్యో వద్దమ్మా.. చీప్ లిక్కర్ సుఖీభవ
- సోముపై సామాన్యులు, సొంత పార్టీ కార్యకర్తల ఆగ్రహం
- అమరావతి, హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘తాము అధికారంలోకొస్తే రూ.50కే చీప్ లిక్కర్ బాటిల్ ఇస్తాం’ అంటూ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ సభలో చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి. మరీ ఇంత ‘చీప్’గా ఎలా మాట్లాడతారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోము వైన్స్.. సారాయి వీర్రాజు అంటూ నెటిజన్లు ఆయనను ఆడేసుకుంటున్నారు. ఇతర పార్టీ నేతలు, సామాన్యులతోపాటు సొంతపార్టీ కార్యకర్తలు సైతం వీర్రాజు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో టీఆర్‌ఎస్ ముఖ్యనేత కేటీఆర్, వైఎ్‌సఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్ర ట్వీట్లు పెట్టడంతో వీర్రాజుపై జాతీయ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.
- ఇంతలా దిగజారుతారా?: కేటీఆర్
- ఆంధ్రప్రదేశ్ బీజేపీ తలపెట్టిన ప్రజాగ్రహ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అధికారం కోసం ఇంతలా దిగజారుతారా? అన్నారు. ‘వావ్ ఏమి పథకం.. ఎంత సిగ్గు.. ఎంత దిగజారుడు.. చీప్ లిక్కర్ రూ.50కే సరఫరా చేసే బంపర్ ఆఫర్ ఒక రాష్ట్రానికేనా..? ఇది బీజేపీ జాతీయ విధానమా.?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
- ‘బీజేపీ చీప్ లిక్కర్.. టీఆర్‌ఎస్ ఖరీదైన మద్యం.. అంతా లిక్కర్ లిక్కర్ అంటూ మద్యంతో దోపిడీ చేస్తున్నారు’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ‘ఏపీలో రూ.50కే చీప్ లిక్కర్ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు చెబుతున్నారు.. మోదీ-షా ద్వయం ఓట్ల కోసం ఇక చీకుల ఆఫర్ కూడా ఇస్తుందేమో’ అంటూ తృణమూల్ ఎంపీ మహువా ట్వీట్ చేశారు. నెటిజన్లు సైతం వీర్రాజుని వదల్లేదు. ‘సోము వైన్స్.. కేవలం రూ.50కే చీప్ లిక్కర్’ అంటూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘మన దేశం.. మనం పాటించే ధర్మం.. మన పార్టీ సిద్ధాంతం గురించి చెప్పి ఓట్లు అడగాల్సిన మీరు ఒక హిందూ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎలా ఉండకూడదో ప్రతి కార్యకర్తా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా ఉంది’ అంటూ బీజేపీ అభిమాని కిశోర్ ఆత్మకూరి ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. ‘
- అసహ్యానికే అసహ్యం పుట్టేలా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నార’ని ఒకరు.. ‘దిగజారుడు తనానికి ప్యాంటు, చొక్కా వేస్తే ఆయనే’ అంటూ మరొకరు.. ‘కనకపు సింహాసనమున శునకం’ అంటూ ఇంకొకరు దారుణమైన కామెంట్లు పోస్టు చేశారు. ‘కోటి మంది తాగుబోతులు ఓట్లేస్తే చీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తామంటూ ఒక అధ్యక్షుడిగా నిండు సభలో ప్రకటిస్తారా.?’ అంటూ పార్టీ అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంకా నయం మంద్యంతోనే ఆపేశారు.. బీజేపీకి ఓటేస్తే ఏపీలో ఉచితంగా వయాగ్రా, కండోమ్స్ సరఫరా చేస్తామని అనలేదు’ అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
- అయ్యయ్యో వద్దమ్మా..
- ‘అయ్యయ్యో వద్దమ్మా...’ అంటూ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న రెడ్ లేబుల్ టీ ప్రకటన తరహాలోనే సోము వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘ప్రత్యేక హోదా.. అయ్యయ్యో వద్దమ్మా... హోదా ఇవ్వలేంగానీ.. చీప్ లిక్కర్ రూ.50కే ఇస్తాం.. సుఖీభవ.. సుఖీభవ..’ అంటూ ప్రకటనకు సంబంధించిన కాంబో ఫొటో హల్‌చల్ చేస్తోంది.