మెడికల్‌ షాపుల్లో మత్తు మందు!

ABN , First Publish Date - 2021-03-29T08:43:54+05:30 IST

కిక్కు కోసం యువత మెడికల్‌ షాపులకు పరుగులు తీస్తోంది..! ప్రధానంగా నేరాలకు పాల్పడుతున్న టీనేజీ వయసు కుర్రాళ్లలో అధికశాతం నిద్రమాత్రలు, ఇతరత్రా మత్తు బిళ్లలను వినియోగిస్తున్నారు.

మెడికల్‌ షాపుల్లో మత్తు మందు!

  • ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే విక్రయాలు.. 
  • బానిసలుగా 14-20 ఏళ్ల వయసువారే

హైదరాబాద్‌ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కిక్కు కోసం యువత మెడికల్‌ షాపులకు పరుగులు తీస్తోంది..! ప్రధానంగా నేరాలకు పాల్పడుతున్న టీనేజీ వయసు కుర్రాళ్లలో అధికశాతం నిద్రమాత్రలు, ఇతరత్రా మత్తు బిళ్లలను వినియోగిస్తున్నారు. వీరిలో 14-20 సంవత్సరాల మధ్య వయస్కులు అధికంగా ఉంటున్నారు. ఇటీవల కొన్ని కేసుల్లో నిందితులను విచారించగా.. ఈ విషయం వెలుగుచూసింది. అంత దర్జాగా.. ధైర్యంగా.. నేరం ఎలా చేశారు అని పోలీసులు ప్రశ్నిస్తే.. వారు మత్తు బిళ్లల విషయాన్ని బయటపెట్టారు. ఆ మత్తులో ధైర్యంగా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది.


36 గంటలు మత్తులోనే

కొన్ని రకాల మత్తు మాత్రలను వైద్యులు అవసరమైన రోగులకు సూచిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఇలాంటి ఔషధాలను ప్రిస్ర్కిప్షన్‌ లేనిదే విక్రయించకూడదు. అయితే.. టీనేజీ కుర్రాళ్లు అధిక మొత్తం చెల్లిస్తుండడంతో.. మెడికల్‌ షాపుల నిర్వాహకులు కొందరు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. మత్తు, నిద్రమాత్రలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. యువత ఆ మాత్రలను కల్లు, బీరు లేదా విస్కీలో కలిపి సేవిస్తోంది. ఫలితంగా.. 36-48 గంటల వరకు మత్తులో జోగుతోంది. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తోంది. ‘‘పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మత్తు మాత్రలను సేవించి, విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు’’ అని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. హైదరాబాద్‌ దక్షిణ మండలంలో పోలీసులు ఇప్పటికే ఈ అంశంపై దృష్టిసారించారు. సౌత్‌జోన్‌ డ్రగ్స్‌ అధికారితో కలిసి.. అదనపు డీసీపీ, ఫలక్‌నుమా ఏసీపీ తమ బృందాలతో ఇప్పటికే 400 దాకా మెడికల్‌ దుకాణాల నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మత్తు మాత్రలను ఇస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2021-03-29T08:43:54+05:30 IST