హే కృష్ణా, గోదావర్రీ..

ABN , First Publish Date - 2021-07-17T08:10:45+05:30 IST

కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాలకు అధికారాలే లేకుండా పోనున్నాయి. కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు(జూరాల వయా తుంగభద్ర నుంచి పులిచింతల

హే కృష్ణా, గోదావర్రీ..

ప్రాజెక్టులన్నీ 3 నెలల్లో కేంద్రం చేతుల్లోకి..

తెలంగాణకు ఖేదం.. ఆంధ్రా ఆమోదం


హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాలకు అధికారాలే లేకుండా పోనున్నాయి. కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు(జూరాల వయా తుంగభద్ర నుంచి పులిచింతల దాకా), గోదావరిపై కట్టిన 71 ప్రాజెక్టులపై(శ్రీరాంసాగర్‌ నుంచి పోలవరం దాకా) తెలుగు రాష్ట్రాల అధికారాలు మరో 3 నెలల్లో హరించుకుపోనున్నాయి. మొత్తం 107 ప్రాజెక్టులపై సంపూర్ణ అధికారాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు(జీఆర్‌ఎంబీ) అప్పగిస్తూ కేంద్రం గురువారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి నీటివిడుదల, జలవిద్యుదుత్పత్తి వంటి అన్ని అంశాలపై అధికారాలను తెలుగు రాష్ట్రాలు వదులుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న జూరాల, నాగార్జునసాగర్‌ నిర్వహణ అధికారాలు తెలంగాణకు ఉండగా.. శ్రీశైలం, పులిచింతలపై ఏపీకి అధికారం ఉంది.


ఒక్క శ్రీశైలంలో కుడి విద్యుత్తు కేంద్రం మినహా... మిగతా నాలుగుచోట్లా తెలంగాణకు జలవిద్యుదుత్పత్తిపై అధికారాలున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో ఆ అధికారాలన్నీ పోనున్నాయి. ప్రాజెక్టులపై అధికారాలను బోర్డుకు అప్పగించే గెజిట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వాగతిస్తుండగా.. తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణాజలాలపై బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు అమల్లోకి రాకుండా, జలాల కేటాయింపుపై స్పష్టత లేకుండా ఏ విధంగా అధికారాలను బోర్డుకు అప్పగిస్తారని తెలంగాణ వాదిస్తోంది. ఇక గోదావరి ప్రాజెక్టులపై ఏ వివాదం లేనప్పటికీ ఈ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని తప్పుపడుతోంది. కృష్ణా నదిపై కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా పురుడుపోసుకున్న ఈ వివాదం తెలుగు రాష్ట్రాలకు శాపంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలో మరే రాష్ట్ర విభజనలో కూడా ఆయా రాష్ట్రాల్లో పారే నదులపై కేంద్ర ప్రభుత్వం అధికారం దఖలు పరుచుకున్న దాఖలాలే లేవని గుర్తుచేస్తున్నారు.


ఒక్క ప్రకటనా లేదు..

కృష్ణా జలాలపై తెలంగాణ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కీలకమైన పాలమూరు-రంగారెడ్డితోపా టు డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ, తాజా గా ప్రతిపాదించిన జోగులాంబ బ్యారేజీ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాలమూరుకు వడివడిగా అనుమతులు పొందడానికి ప్రయత్నిస్తూనే.. ఏపీకి కౌంటర్‌గా ప్రతిపాదించిన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారీకి కూడా ఆదేశించింది. అంతలోనే ప్రాజెక్టులన్నింటినీ బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం.. ఈ నోటిఫికేషన్‌ అమల్లోకి రావడానికి 3నెలలే గడువు ఉండటం.. నిర్ణయం వెలు వడి 24 గంటలు గడుస్తున్నా రాష్ట్రప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా రాకపోవడం చర్చానీయాంశమైంది.

Updated Date - 2021-07-17T08:10:45+05:30 IST