బర్డ్‌ ఫ్లూపై అప్రమత్తం

ABN , First Publish Date - 2021-01-12T09:30:21+05:30 IST

పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. పట్టణ ప్రగతికి ప్రతి నెలా రూ.148 కోట్లు, జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు

బర్డ్‌ ఫ్లూపై అప్రమత్తం

అధికారులకు ముఖ్యమంత్రి సూచన

పట్టణాల రూపురేఖలు మారుతున్నాయి

ప్రతి నెలా రూ.148 కోట్లు ఇస్తున్నాం: కేసీఆర్‌

బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని సూచన


హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. పట్టణ ప్రగతికి ప్రతి నెలా రూ.148 కోట్లు, జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ప్రస్తుతం 2,802 పారిశుధ్య వాహనాలున్నాయి. మరో 2,004 వాహనాలను సమకూరుస్తున్నాం. అన్ని పట్టణాల్లో డంప్‌ యార్డుల నిర్మాణం జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో 1,018 నర్సరీలు, జీహెచ్‌ఎంసీలో 500 నర్సరీలున్నాయి. ప్రతి లక్ష జనాభాకు ఒక వైకుంఠధామం చొప్పున నిర్మించాలి. రాష్ట్రంలోని  116 పట్టణాల్లో వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ (సమీకృత) మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాం. జనాభా ఎక్కువ ఉన్న పట్టణాల్లో అదనంగా మార్కెట్లను నిర్మించాలి. ఇందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. అన్ని పట్టణాల్లో పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించాలి. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి’’ అని కేసీఆర్‌ ఆదేశించారు.


మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మిగిలిన 28 వేల మంది లబ్దిదారులకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ సోకుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బర్డ్‌ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించాలని సీఎ్‌సకు నిర్దేశించారు. హరితహారం వల్ల రాష్ట్రంలో పచ్చదనం 3.67శాతం పెరిగినట్లు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడించినట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, అటవీ అధికారులను అభినందించారు. హరితహారంలో అద్భుత ప్రగతి సాధించినందుకు కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌, భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డిని ప్రశంసించారు.

Updated Date - 2021-01-12T09:30:21+05:30 IST