ముందుంది థర్డ్‌ వేవ్‌!

ABN , First Publish Date - 2021-12-31T08:27:35+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రమాదం ఉందని, సంక్రాంతి తర్వాత ఇది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు.

ముందుంది థర్డ్‌ వేవ్‌!

  • సంక్రాంతి తర్వాత కరోనా కేసులు అధికం
  • రాష్ట్రంలో 2, 3 రోజులుగా పెరుగుతున్న కేసులు 
  • మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకం
  • పండుగలను ఇళ్లల్లోనే జరుపుకోవాలి
  • థర్డ్‌వేవ్‌ తర్వాత కొవిడ్‌ నుంచి విముక్తి: గడల
  • రాష్ట్రంలో మరో 5 ఒమైక్రాన్‌ కేసులు నమోదు


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రమాదం ఉందని, సంక్రాంతి తర్వాత ఇది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఒమైక్రాన్‌ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోనూప్రభావం ఉంటుందని వివరించారు. సంక్రాంతి తర్వాత కేసుల సంఖ్య రెట్టింపయ్యే వీలుందని పేర్కొన్నారు. కాకపోతే.. థర్డ్‌ వేవ్‌ తర్వాత కరోనా సమస్య పరిసమాప్తమైనట్లు భావించవచ్చన్నారు. గురువారం హైదరాబాద్‌ కోఠిలోని కార్యాలయంలో గడల విలేకరులతో మాట్లాడారు. ఒమైక్రాన్‌ ఆందోళనల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతిని ఇళ్లలోనే జరుపుకోవాలన్నారు. పార్టీలకు వెళ్లినా నిబంధనలు పాటించాలన్నారు. 


తేలిగ్గా తీసుకుంటే ముప్పు..

రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్నదని డాక్టర్‌ గడల తెలిపారు. వైర్‌సను తేలిగ్గా తీసుకుంటే మరో ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని పేర్కొన్నారు. ‘‘రాబోయే 3, 4 వారాలు అత్యంత కీలకం. కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా సంక్రాంతి తర్వాత కేసులు తీవ్ర స్థాయికి వెళ్తాయి. కరోనా పట్ల భయం అవసరం లేదు. కానీ జాగ్రత్తలతో పాటు నిబంధనలను గతంలో కంటే సీరియ్‌సగా పాటించాల్సిన అవసరం ఉంది’’ అని గడల అన్నారు. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కోనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందన్నారు. మరోవైపు జాతీయ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.


2 వరకు సభలు, ర్యాలీలపై నిషేధం: డీజీపీ 

కొవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా 2వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని వారికి రూ.1,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 


కొత్త కేసులు 280 

రాష్ట్రంలో గురువారం మరో 5 ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు ముప్పు జాబితాలో లేని దేశాల నుంచి వచ్చినవారే. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 67కు చేరింది. మరోవైపు గురువారం విదేశాల నుంచి 143 మంది రాగా.. నలుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా, కొత్తగా 280 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. నలుగురు ఒమైక్రాన్‌ బాధితులు కోలుకున్నారు. తాజా కరోనా కేసుల్లో జీహెచ్‌ఎంసీలోనే 167 నమోదయ్యాయి. డిసెంబరులో ఇవే అత్యధికం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ప్రవాస భారతీయుడికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఈయన ఇటీవలే అమెరికా నుంచి కుటుంబంతో కామారెడ్డి వచ్చారు.

Updated Date - 2021-12-31T08:27:35+05:30 IST