ప్రాణాలు పోతుంటే ప్రవేశాలా?

ABN , First Publish Date - 2021-05-27T09:58:12+05:30 IST

తెలంగాణ ఇంటర్‌ బోర్డు తీరు ‘ఎవరెట్లా పోతే నాకేంటి’ అన్న చందంగా ఉంది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కల్లోలంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

ప్రాణాలు పోతుంటే ప్రవేశాలా?

  • కాలేజీలకు అనుబంధ గుర్తింపుల్లేవు.. 
  • సిలబ్‌సపై స్పష్టత లేదు.. 
  • అయినా 1 నుంచి ప్రవేశాలు ఎలా?
  • ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌పై తీవ్ర విమర్శలు 
  • వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ లెక్చరర్లు, ప్రైవేటు యాజమాన్యాలు 
  • కార్పొరేట్‌ కాలేజీల ప్రయోజనం కోసమే అంటున్న సంఘాలు 


హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇంటర్‌ బోర్డు తీరు ‘ఎవరెట్లా పోతే నాకేంటి’ అన్న చందంగా ఉంది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కల్లోలంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. మరోవైపు వైరస్‌ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్‌ బోర్డు ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రవేశాలు ప్రారంభించేంత అత్యవసర పరిస్థితి ఏమిటని ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లతో పాటు ప్రైవేటు కాలేజీల వారూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 80శాతం ప్రవేశాలను పూర్తిచేసుకున్న కార్పొరేట్‌ కాలేజీలకు అనుకూలంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. 


గుర్తింపు లేకుండానే ప్రవేశాలా..? 

కరోనా తీవ్రత నేపథ్యంలో మే-1 నుంచి జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రథమ సంవత్స రం విద్యార్థుల పరీక్షలను రద్దుచేసిన బోర్డు.. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై కేంద్రం సైతం తర్జనభర్జన పడుతున్న వేళ.. ఇంటర్‌ బోర్డు మంగళవారం ప్రవేశాల షెడ్యూల్‌నే విడుదల చేసేసింది. ఈ నెల 25 నుంచే జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చని, జూన్‌-1 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని తల్లిదండ్రులను కోరిన అధికారులు.. అసలు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తికాకముందే ప్రవేశాలకు ఎందుకు అనుమతించారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. గుర్తింపు దరఖాస్తుకు వచ్చేనెలాఖరు వరకు గడువుంది. 


ఈ ప్రశ్నలకు సమాధానమేది? 

వారం రోజుల్లో ప్రవేశాలు పూర్తిచేసుకుని, ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించడం ఎలా సాధ్యం? 

బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేరాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరింది. రాష్ట్రవ్యాప్తంగా 1685 ప్రైవేట్‌ కాలేజీలుండగా.. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు గడువు జూన్‌ నెలాఖరు వరకు ఉంది. గుర్తింపు ఇవ్వకుండానే ప్రవేశాలకు ఎలా అనుమతిస్తారు? 

గుర్తింపు లేకుండానే ప్రవేశాలు జరిగాక ఆ కాలేజీకి గుర్తింపు దక్కకుంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటి?

పదోతరగతి ఫలితాలు ఈ నెల 21న విడుదలయ్యాయి. అప్పటికే కార్పొరేట్‌ కాలేజీలు నిబందనలకు విరుద్ధంగా 80 శాతం ప్రవేశాలు పూర్తి చేసుకోగా, ఫలితాలు విడుదలయ్యాక 100 శాతం ప్రవేశాలు పూర్తయ్యాయి. వారి ప్రయోజనాల కోసమే ఇంటర్‌ బోర్డు ప్రవేశాల షెడ్యూల్‌ ప్రకటించిందా? 

ఈ విద్యాసంవత్సరంలో సిలబస్‌ పరిస్థితి ఏంటి? మొత్తం ఉంటుందా.. తగ్గిస్తారా? ఈ విషయాలపై స్పష్టత లేకుండా ఆన్‌లైన్‌ తరగతులు జూన్‌-1 నుంచి ఎలా ప్రారంభించాలి?

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రవేశాలు పొందవచ్చని ఇంటర్‌ బోర్డు చెబుతోంది. కానీ, గత ఏడాది 98శాతం విద్యార్థులు ఆ సౌకర్యాన్ని వినియోగించుకోలేదు. అనేకమంది కాలేజీలకు వెళ్లి దరఖాస్తు చేసుకోగా.. కొందరు విద్యార్థులు మీసేవ కేంద్రాలకు వెళ్లి అప్లై చేశారు. ఈసారి లాక్‌డౌన్‌లో కాలేజీలకు, మీసేవ కేంద్రాలకు వెళ్లడం ఎలా? స్మార్ట్‌ఫోన్లు లేని గ్రామీణ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? 


బోర్డుది అనాలోచిత నిర్ణయం..

రాష్ట్రమంతా కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో ప్రవేశాలను ప్రకటించడం ఇంటర్‌బోర్డు అనాలోచి త చర్యకు నిదర్శనం. ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తుల చేతిలో బంధీగా మారిందనడానికి నిదర్శనం. అస లు కాలేజీలకు అనుబంధ గుర్తింపులే ఇవ్వకుండా ప్రవేశాలకు ఎలా అనుమతిస్తారు. ఇంటర్‌ బోర్డు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. 

- రామకృష్ణ గౌడ్‌, కన్వీనర్‌, 

ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి


కార్పొరేట్ల కోసమే నిర్ణయం.. 

రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న ప్రైవేటు బడ్జెట్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకుండానే ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గుర్తింపు కోసం మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లు, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు  కావాల్సి ఉంది. దరఖాస్తుకు జూన్‌ నెలాఖరువరకు గడువు ఉంది. అది పూర్తవకముందే ప్రవేశాలను ప్రకటించడం కార్పొరేట్‌ కాలేజీల ప్రయోజనాల కోసమే అన్నది స్పష్టమవుతుంది. 

- గౌరీ సతీష్‌, అధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం 

Updated Date - 2021-05-27T09:58:12+05:30 IST