వ్యసనం ముదిరి సైకోలుగా!

ABN , First Publish Date - 2021-10-07T07:26:49+05:30 IST

‘‘మా నాన్న నన్ను చాలా వేధిస్తున్నాడు. ఆయన నుంచి నాకు రక్షణ కల్పించండి’’

వ్యసనం ముదిరి సైకోలుగా!

  • ఆన్‌లైన్‌ గేమ్‌లతో మారుతున్న యువత మానసిక స్థితి
  • అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘మా నాన్న నన్ను చాలా వేధిస్తున్నాడు. ఆయన నుంచి నాకు రక్షణ కల్పించండి’’ అంటూ 16 ఏళ్ల కుర్రాడు నాలుగు రోజుల క్రితం హాక్‌ఐ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయం 6 గంటలకు ఫిర్యాదు చేసిన కుర్రాడు.. పదింటి దాకా వేచి చూసి, పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో మరో ఉన్నతాధికారిని ఆశ్రయించాడు. ఉన్నతాధికారి ఆదేశాలతో ఆ కుర్రాడి ఇంటికి చేరుకున్న పాతబస్తీ పోలీసులు.. అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు. ఆ కుర్రాడి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.


‘‘ఆరోగ్యం సరిగ్గా లేని ఆయన్నుంచి నీకేం హాని ఉంది?’’ అని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘నేను అడిగినప్పుడల్లా నాకు ఫోన్‌ ఇవ్వట్లేదు’’ అని ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని వారు అవాక్కయ్యారు. అసలు విషయమేంటని తండ్రిని ప్రశ్నిస్తే.. తన వద్ద ఒకే ఒక్క స్మార్ట్‌ఫోన్‌ ఉందని, దాంట్లో తన కొడుకు ఫ్రీ ఫైర్‌, పబ్జీ వంటి గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసి రాత్రింబవళ్లూ ఆడుతున్నాడని వాపోయారు. లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆ తండ్రి ఆందోళన వెలిబుచ్చాడు. స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హాక్‌ఐ యాప్‌ గురించి తెలుసుకున్న ఆ కుర్రాడు.. తరచూ పోలీసుల పేర్లు చెప్పి చాలా మందిని బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తన తండ్రి స్నేహితుడి మీద కూడా ఆ అబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు గుర్తించారు.


మరో కేసులో.. పాతబస్తీకి చెందిన ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న ఓ యువకుడు స్మార్ట్‌ఫోన్‌ కోసం వైద్య వృత్తిలో ఉన్న తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. విచారించిన పోలీసులు తండ్రితో పాటు.... ఫిర్యాదు చేసిన యువకుణ్నీ పీఎ్‌సకు రప్పించారు. అతడిదీ ఈ 16 ఏళ్ల కుర్రాడి పరిస్థితేనని వారికి అర్థమైంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వ్యసనానికి బానిసలైపోవడంతో వారి మెదడు అదుపు తప్పుతోందని.. ఫోన్‌ చేతికందకపోతే తాము ఏం చేస్తున్నారో తెలియని దుస్థితికి చేరుకుంటున్నారని పోలీసులు  తెలిపారు. వారిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంటే ఒక యువకుడు తమపైనే ఆవేశంతో ఊగిపోయినట్టు చెబుతున్నారు.


అతణ్ని ఆస్పత్రికి తరలించి మానసిక వైద్యనిపుణులతో పరీక్షలు చేయించగా.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ విపరీతంగా ఆడడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు వైద్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. పిల్లలకు చదువుల కోసం ఇస్తున్న స్మార్ట్‌ఫోన్లు వారిని ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలుగా మారుస్తున్నాయని.. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వారు గంటల తరబడి ఫోన్‌లకు అతుక్కుపోకుండా బయటకు వెళ్లి ఆడుకునేలా.. స్నేహితులతో కలిసి సమయం గడిపేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు.


2025 నాటికి 29 వేల కోట్లకు..

భారతదేశంలో నానాటికీ పెరుగుతున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ విలువ.. 2025 నాటికి దాదాపు రూ.29,062 కోట్లకు చేరుతుందని ‘ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ)’ అంచనా వేసింది. అందులో 90ు మొబైల్‌ గేమింగ్‌దేనని వెల్లడించింది. ‘బిల్డింగ్‌ ఆప్‌ ద ఈ-గేమింగ్‌ ఎకోసిస్టమ్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ ద ఇన్‌ఫ్లూయెన్స్‌ ఆఫ్‌ స్మార్ట్‌ఫోన్స్‌’ పేరిట మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. గత ఆరునెలల్లో ఈ రంగంలోకి దాదాపు రూ.7452 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. భారతదేశంలో ప్రస్తుతం 43 కోట్ల మంది మొబైల్‌ గేమర్లున్నారని.. 2025 నాటికి వారి సంఖ్య 65 కోట్లకు చేరనుందని అంచనా వేసింది.


Updated Date - 2021-10-07T07:26:49+05:30 IST