తెల్లారిన బతుకులు

ABN , First Publish Date - 2021-05-31T05:24:44+05:30 IST

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు
ఉమాదేవి(ఫైల్‌), పెంబర్తి కుమారస్వామి (ఫైల్‌)

ఇసుక లారీ, ట్రాలీ ఆటో ఢీ..

కూరగాయల కోసం వెళ్లివస్తూ మృత్యుఒడికి..

మృతుల్లో ఆటోడ్రైవర్‌, కూరగాయలు విక్రయించే మహిళ

మరో మహిళకు తీవ్ర గాయాలు

ఒగ్లాపూర్‌ వద్ద ఘటన.. మృతులది పరకాల 

దామెర, మే 30: తెల్లవారుజామును రెండు నిండు ప్రాణాలు తెల్లారిపోయాయి.. ఇసుకలారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. దామెర ఎస్సై యు.భాస్కర్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

పరకాలకు చెందిన కెమిశెట్టి ఉమాదేవి(50), గద్దల రజితలు ఇద్దరూ కలిసి వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. పరకాల పట్టణంలోని పెంబర్తి కుమారస్వామి అలియాస్‌ రవికుమార్‌కు చెందిన ట్రాలీ ఆటోలో వరంగల్‌ కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ కూరగాయలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గూడెప్పాడ్‌ వైపు నుంచి హన్మకొండ వైపునకు వెళ్తున్న ఇసుక లారీ, వరంగల్‌-భూపాలపట్నం జాతీయ రహదారి-163 వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్‌ డిస్నీల్యాండ్‌ హై స్కూల్‌, సైలానీ బాబాదర్గా సమీపంలో ఇసుక లారీ, ట్రాలీ ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పరకాలకు చెందిన కూరగాయల వ్యాపారి కెమిశెట్టి ఉమాదేవి(50) అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్‌ పెంబర్తి కుమారస్వామి(33) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో కూరగాయల వ్యాపారి గద్దల రజితకు తీవ్ర గాయాలు కాగా, 108అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కెమిశెట్టి ఉమాదేవి కుమారుడు భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తె లిపారు. ఉమాదేవి భర్త రాజేశం గతంలోనే మృతి చెందగా, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మరో మృతుడు పెంబర్తి కుమారస్వామికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికింకా సంతానం లేదు.

అతి వేగం ప్రమాదానికి కారణం...

రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు కారణంగా రోడ్డుపై ట్రాఫిక్‌ తక్కువగా ఉండడంతో వాహనాలు వేగంగా వెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ శ్రీనివాస్‌

ఘటనా స్థలాన్ని ఏసీపీ పి.శ్రీనివాస్‌ పరిశీలించారు. రహదారిలో కొంత సేపు ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తడంతో ఏసీపీతోపాటు సీఐ టి.రమే్‌షకుమార్‌, ఎస్సై యు.భాస్కర్‌రెడ్డి, ఏఎస్సై పోచయ్యలు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు మార్గంలో అతి వేగం పనికి రాదని, తద్వారా అధికంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ప్రతీ వాహనదారుడు రోడ్డు నియమ, నిబంధనలను విధిగా పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2021-05-31T05:24:44+05:30 IST