సెలూన్లు, ధోబీఘాట్ల ఉచిత విద్యుత్తుకు 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2021-05-30T09:14:10+05:30 IST

సెలూన్లు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు కోసం జూన్‌ 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు.

సెలూన్లు, ధోబీఘాట్ల ఉచిత విద్యుత్తుకు 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

2 లక్షల రజక, 70 వేల నాయీ కుటుంబాలకు లబ్ధి: గంగుల 


హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): సెలూన్లు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు కోసం జూన్‌ 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 2 లక్షల రజక, 70 వేల నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు www.tsobmms.cgg.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కుల వృత్తులు నిర్వహించుకుంటున్న రజక, నాయీ బ్రాహ్మణులకు ఈ సౌకర్యం కల్పించినట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి తపించే కేసీఆర్‌.. రాష్ట్రానికి సీఎంగా ఉండడం మన అదృష్టమన్నారు. విద్యుత్తు బిల్లు రాయితీలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను ఏప్రిల్‌ మొదట్లోనే ప్రకటించినట్లు గుర్తుచేశారు. 250 యూనిట్ల విద్యుత్తు రాయితీని ప్రతినెల ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందని పేర్కొన్నారు. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉంటుందని, ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులో పేరు, జెండర్‌, మొబైల్‌, ఆధార్‌ నంబర్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఉపకులం, యూనిట్‌ పేరు, యూనిట్‌ చిరునామాతోపాటు తన పేరు/అద్దె నివాసానికి చెందిన కమర్షియల్‌ ఎలక్ట్రికల్‌ కన్స్యూమర్‌ నంబర్‌ (కరెంట్‌ మీటర్‌ నెంబర్‌) వంటి వివరాల్ని అందజేయాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-05-30T09:14:10+05:30 IST