మహా ధర్నా వల్లే సాగు చట్టాల రద్దు

ABN , First Publish Date - 2021-11-20T08:14:21+05:30 IST

సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నాతో కేంద్ర ప్రభు త్వం దిగివచ్చి సాగు చట్టాలను రద్దు చేసిందని పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. శుక్రవారం వేర్వేరుచోట్ల వారు మాట్లాడుతూ..

మహా ధర్నా వల్లే సాగు చట్టాల రద్దు

  • మంత్రులు, పలువురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల స్పందన
  • ఉద్యమిస్తే ఉనికికి ముప్పని మోదీ భావించారు: నిరంజన్‌రెడ్డి
  • దీక్షతో సాధించారు.. అధికారం కంటే ప్రజలే గొప్ప: కేటీఆర్‌
  • అన్నదాతలు శక్తిని, పోరాటాన్ని రుచి చూపారు: హరీశ్‌రావు


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నాతో కేంద్ర ప్రభు త్వం దిగివచ్చి సాగు చట్టాలను రద్దు చేసిందని పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. శుక్రవారం వేర్వేరుచోట్ల వారు మాట్లాడుతూ.. కేంద్రం నిర్ణయంపై స్పందించారు. టీఆర్‌ఎస్‌ పోరాట శైలి బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి తెలుసని.. సాగు చట్టాలపై కేసీఆర్‌ ఉద్యమిస్తే ఉత్తరాది రైతు ఆందోళనలు దక్షిణాదికి విస్తరించి, కేంద్ర ప్రభుత్వ ఉనికికే ముప్పని ప్రధాని మోదీ భావించినట్లు తెలుస్తోందని మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్‌లో  మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన టీఆర్‌ఎస్‌ పోరాటం ఆపదని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, రైతులు అకుంఠిత పోరాటంతో డిమాండ్‌ను నెరవేర్చుకోవడం ద్వారా.. అధికారంలో ఉన్న వారికంటే ప్రజల శక్తే బలీయమైనదని రుజువైందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.  రైతులు రా త్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో శక్తిని, పోరాటాన్ని కేంద్రానికి రుచి చూపించారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కేసీఆర్‌ పోరాట పంథా కు భయపడే కేంద్రం వెనక్కుతగ్గిందని హోం మంత్రి మహమూద్‌ అలీ అభిప్రాయపడ్డారు. కాగా, కేసీఆర్‌  ఆందోళన ఉధృతం అవుతుందన్న భయంతోనే కేంద్రం సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకుందని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్‌లో కేసీఆర్‌ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ చేసిన ధర్నాతో ప్రధాని మోదీ కళ్లు తెరిచారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేసీఆర్‌ రైతుల పక్షాన పోరాడడంతో కేం ద్రం తలొంచిందని మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. 


రైతు ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం: ఎంపీ నామ

రైతుల ఉద్యమానికి కేంద్రం తలొగ్గి సాగు చట్టాలను రద్దు చేసిందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు. యూపీ, పం జాబ్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందన్నారు.  కేంద్రం గతంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే రైతులు చనిపోయేవారు కాదని ఎంపీ లు కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, రాములు, మన్నె శ్రీనివా్‌సరెడ్డి, మాలోత్‌ కవిత, వెంకటేష్‌ నేత అన్నారు. వారి కుటుంబాలను కేంద్ర ప్ర భుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉధృతంగా సాగిన రైతాంగ పోరులో అసువులు బాసిన అన్నదాతలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో నివాళి తెలిపారు. వారి త్యాగం మహోన్నతమని అభిప్రాయపడ్డారు.


న్యాయం జరిగేవరకు టీఆర్‌ఎస్‌ పోరాటం: వినోద్‌కుమార్‌

రైతులకు మద్దతుగా కేంద్రంపై కేసీఆర్‌ పోరాటాన్ని ప్రకటించగానే.. ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.  కేసీఆర్‌ పోరాట ఫలితమే.. సాగు చట్టాల రద్దు అని రైతుబంధు సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులు ఉద్యమానికి మోడీ సర్కారు స్పందించలేదని, కేసీఆర్‌ పోరాటం చేస్తే వెంటనే పరిష్కారం దొరికిందని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ అన్నారు.

Updated Date - 2021-11-20T08:14:21+05:30 IST