DS కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్ ఎందుకు పడింది.. మనసు మార్చుకున్నారా.. ఎందుకిలా జరిగింది..!?

ABN , First Publish Date - 2021-12-26T22:31:36+05:30 IST

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్ ఎందుకు పడింది?..

DS కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్ ఎందుకు పడింది.. మనసు మార్చుకున్నారా.. ఎందుకిలా జరిగింది..!?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్ ఎందుకు పడింది? డీఎస్‌ మనసు మార్చుకున్నారా? లేక కాంగ్రెస్ నేతలే పావులు కదిపారా? ఇంతకీ ఈ హ్యాండ్‌ బ్రేకులు తాత్కాలికమా? లేదంటే కాంగ్రెస్‌లో చేరకుండా శాశ్వతంగా డోర్స్ క్లోజ్ చేశారా? అసలు కాంగ్రెస్‌లో డీఎస్‌ చేరిక ఎందుకు ఆగింది? అసలా పార్టీలో ఏం జరిగింది? అనేది ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


చక్రం తిప్పిందెవరు..!?

అయితే ఇప్పుడు డీఎస్‌ ఏ టర్న్ తీసుకుంటారు అనే చర్చ జరుగుతుండగానే.. ఆయన అడుగులు కాంగ్రెస్ వైపునకు పడ్డాయి. తనకు ఎంతో అవకాశం ఇచ్చిన పార్టీని వీడి తప్పు చేశానని, అది సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని హస్తిన పెద్దలను డీఎస్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇక్కడే టి.కాంగ్రెస్ నేతలు చక్రం తిప్పినట్లు సమాచారం. ఆయన సోనియాగాంధీ నుంచి అనుమతి తీసుకుంటే.. వీరు రాహుల్ గాంధీ నుంచి నరుక్కొచ్చారని టాక్. పార్టీ కష్టకాలంలో మోసం చేసి వెళ్లిన వాళ్లను తిరిగి చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టీపీసీసీలో కీలక నేతలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు డీఎస్‌ను చేర్చుకోకుండా వేగంగా పావులు కదిపినట్లు సమాచారం. సోనియాను కలిసినట్లు తెలియగానే క్షణాల్లో డీఎస్ మీద ఫిర్యాదుల వరదను పారించినట్లు జోరుగా చర్చ జరుగుతోంది.


అప్పట్లో ఊహించని షాక్!

డి.శ్రీనివాస్‌కు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హైకమాండ్ పెద్దలతో అపాయింట్‌మెంట్ లేకుండా వెళ్లి కలిసే గుర్తింపు ఆయనకు ఉందని చెబుతారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతర పరిణామాల్లో డీఎస్.. టీఆర్ఎస్‌లో చేరి కాంగ్రెస్‌కు ఊహించని షాకిచ్చారు. కేసీఆర్ సైతం ఆయనకు రాజ్యసభకు పంపి గౌరవించారు. అయితే ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరడం..ఆయన గెలుపు కోసం డీఎస్ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టారు. డీఎస్ సైతం టీఆర్ఎస్‌కు దూరంగా ప్రస్తుతం పొలిటికల్ చౌరస్తాలో ఉన్నారు.


డీఎస్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో..!?

సీనియర్ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ ఆసక్తిగా మారింది. గత కొన్నేళ్లుగా అధికార టీఆర్ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన.. ఏ టర్న్ తీసుకుంటారనే చర్చ వాడివేడిగా జరుగుతోంది. ఇటీవల ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. దీంతో కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకు డీఎస్ సైతం రెడీ అయ్యారని, ఈనెల 18నే ఆయన జాయిన్ అవుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ దీని మీద చర్చించడానికి రావాలని సీఎల్పీ నేత భట్టికి పిలుపు వచ్చిందనే చర్చ కూడా జోరుగా జరిగింది. కానీ భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ వాయిదా పడింది. అటు డీఎస్‌ చేరిక ఆగిపోయింది. దాంతో జాయినింగ్ ఎందుకు ఆగింది? అసలేం జరిగిందన్న ప్రశ్నలు అటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నం అవుతున్నాయి. దీనిపై ఇప్పుడు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.


హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో..!?

డి.శ్రీనివాస్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా.. ఆయన వయసు రిత్యా పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదని కొందరు వాదించారట. కేవలం ఆయన తన పెద్ద కుమారుడికి పార్టీ టిక్కెట్‌ ఇప్పించుకోవడానికి మాత్రమే కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధపడ్డట్లు ఫిర్యాదులో వివరించారట. ఇక ఆయన కుమారుడు బీజేపీలో ఉన్నందున ఎన్నికల సమయంలో ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కోసం పనిచేసే అవకాశమే ఉండదని అధిష్టానం పెద్దలకు తేల్చి చెప్పారట. దీంతో రాహుల్‌గాంధీ డీఎస్‌ చేరకుండా బ్రేకులు వేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇంత జరిగాక డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరుతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కాంగ్రెస్‌లోని ఓ వర్గం వారు మాత్రం ఇక ఆయనకు డోర్స్ పర్మినెంట్‌గా క్లోజ్ అయినట్లేనని తేల్చి చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ.. అసలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డీఎస్ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.Updated Date - 2021-12-26T22:31:36+05:30 IST