‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ఎండీ ఆర్కేకు సతీవియోగం

ABN , First Publish Date - 2021-04-27T12:45:49+05:30 IST

‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది.

‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ఎండీ ఆర్కేకు సతీవియోగం

హైదరాబాద్ : ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ(63) కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు. దుర్గ మరణంతో ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇవాళ ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య జూబ్లీహిల్స్‌‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.


స్కూల్ టీచర్ నుంచి ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా..

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర వేలేరులో కనకదుర్గ జన్మించారు. బిషప్ అజరయ్య స్కూల్లో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదువుకున్న కనకదుర్గ.. విజయవాడలోనే సిటీ పబ్లిక్ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. అనంతరం బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం చేశారు. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్‌లోని పలు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లలో ఆమె విధులు నిర్వర్తించారు. బంజారాహిల్స్ బ్రాంచ్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో కనకదుర్గ వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. 1983 జూలై 3న వేమూరి రాధాకృష్ణ- కనకదుర్గల వివాహం జరిగింది. 2002లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌గా, 2009లో ఏబీఎన్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కనకదుర్గకు కుమారుడు ఆదిత్య, కుమార్తె అనూష ఉన్నారు. కనకదుర్గ తమ్ముడు కోగంటి శేషగిరిరావు ఆంధ్రజ్యోతి ప్రచురణకర్తగా ఉన్నారు.

Updated Date - 2021-04-27T12:45:49+05:30 IST