Revanth Reddy కి TPCC ఇచ్చాక కాంగ్రెస్‌లో నయా జోష్.. జెట్ స్పీడ్‌తో ఢీ కొడుతున్నా.. వాళ్లంతా ఏం చేస్తున్నారు.. Assembly వేదికగా ఏమవుతుందో..!?

ABN , First Publish Date - 2021-10-07T21:01:28+05:30 IST

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలో ఉన్న ఫైర్ తమ ఎమ్మెల్యేల్లో లేదా..? ...

Revanth Reddy కి TPCC ఇచ్చాక కాంగ్రెస్‌లో నయా జోష్.. జెట్ స్పీడ్‌తో ఢీ కొడుతున్నా.. వాళ్లంతా ఏం చేస్తున్నారు.. Assembly వేదికగా ఏమవుతుందో..!?

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలో ఉన్న ఫైర్ తమ ఎమ్మెల్యేల్లో లేదా..? రాష్ట్రంలో రాజకీయం ఎన్నికలను తలపిస్తుంటే.. సీతక్క మినహా మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు..? తమ అధ్యక్షుడిలా అధికార పార్టీపై వాయిస్ ఎందుకు పెంచలేకపోతున్నారు? కనీసం అసెంబ్లీలోనైనా పార్టీ తరుపున గళాన్ని వినిపిస్తారా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఒక్కసారిగా పెరిగిన గ్రాఫ్!

తెలంగాణలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీది దీనపరిస్థితి. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, సరైన నాయకత్వం లేక ఇబ్బందుపడింది. ఉన్న సీనియర్లు ఇళ్లకు పరిమితమైతే, యాక్టివ్‌గా ఉన్న కార్యవర్గం ఇతర పార్టీల్లో అవకాశాల కోసం చూసిన పరిస్థితి. ఇదే సమయంలో పార్టీ పగ్గాలను రేవంత్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం. అప్పటి వరకు ఉన్న పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో ప్రత్యామ్నయ శక్తిగా మారింది. అధికార పార్టీతో పాటు అప్పటి వరకు జోష్ మీదఉన్న బీజేపీకి, కొత్తగా ఏర్పడిన పార్టీలకు.. రేవంత్‌ను ఎదుర్కోవడం సాహసంలా మారింది. అయితే అధికారానికి దగ్గరలో ఉన్నామని చెబుతున్న నయా బాస్.. అధికార పార్టీపై ఒక రకంగా యుద్ధమే చేస్తున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన అఖిలపక్షం దాదాపు రెండు నెలలకు సరిపడా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అంతా బాగానే ఉన్నా హస్తం పార్టీ ఎమ్మెల్యేల తీరు మాత్రం ఇంకోలా ఉంది. పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలకు.. సిఎల్పీకి సంబంధం లేనట్లుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది.


రేవంత్ జెట్ స్పీడ్‌తో అధికార పార్టీని ఢీ కొడుతున్నా..! 

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. అప్పటి వరకు రెస్ట్ మోడ్ లో ఉన్న కార్యకర్తలు అంతా ఉత్సాహంగా పని చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ మధ్య కాలంలో రేవంత్ చేపట్టిన పలు ఆందోళనలు అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన దండోరా సభలు, దీక్షలతో.. రెండేళ్ల ముందే తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. రేవంత్ జెట్ స్పీడ్‌తో అధికార పార్టీని ఢీ కొడుతున్నా.. పార్టీలోని కొంతమంది సీనియర్లు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఆయన నిర్ణయాలకు దూరంగా ఉంటూనే ఉన్నారు. రేవంత్ పిసిసి చీఫ్ అయిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో రేవంత్ రెడ్డి, తన టీంతో ప్రజా సమస్యలపై ఎలాంటి వ్యూహాలు అమలు చేయిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రేవంత్ వ్యూహాలకు తన పార్టీ ఎమ్మెల్యేలు సహకరిస్తారా.. పార్టీ చేస్తున్న ఆందోళనలపై ఉభయ సభల్లో తమ గళం ఎంత వరకు విప్పుతారు? బయట రేవంత్ లో కనిపిస్తున్న ఫైర్ ను.. చట్టసభల్లో ఎమ్మెల్యేలు కూడా చూపిస్తారా.. లేదా అనే అంశంపై ఇప్పుడు హస్తం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.


గొడవలు ఉన్నాయని చెప్పేందుకే..!

కాంగ్రెస్ పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేల్లో సీతక్క మినహా, మిగిలినవారు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ సీఎల్పీలా పరిస్థితులు మారినట్లు టాక్ నడుస్తోంది. పార్టీ అధినేత నిర్ణయాలకు సంబంధం లేనట్లుగా సిఎల్పీ సొంత నిర్ణయాలు, సొంత పోరాట అంశాలు తీసుకుందని చర్చ సాగుతోంది. మరోవైపు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిఎల్పీ సమావేశంలోనే రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి రేవంత్ హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేవంత్‌తో గొడవలు ఉన్నాయని చెప్పేందుకే ఇలా చేస్తున్నారా అనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌లోకి వెళ్ళాలంటే తమను ఆపేది ఎవరని ప్రశ్నించారు జగ్గారెడ్డి.


ఎంతవరకు గళం వినిపిస్తారో..!

సీఎల్పీ నేత భట్టి, కోమటి రెడ్డి రాజగోపాల్, పొదెం వీరయ్య సైతం రేవంత్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కొంతకాలం రేవంత్ నాయకత్వానికి దూరంగా ఉన్నా.. ఈ మద్య అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు మినహా, మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలపై హస్తం పార్టీ ఎమ్మెల్యే లు.. అసెంబ్లీ వేదికగా ఎంత వరకు తమ గళం వినిపిస్తారాన్నది హాట్ టాపిక్‌గా మారింది. 


ఏ మలుపు తిరుగుతుందో..!?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరిపై ఇప్పటికే కోవర్టులు అనే ముద్ర పడింది. వీరికి, పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి రావడం మింగుడు పడటం లేదని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగం, దళిత గిరిజన ఆత్మ గౌరవ ఉద్యమం పేరుతో రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులకు కేటిఆర్‌కు లింక్ ఉందని.. విసిరిన వైట్ ఛాలెంజ్ పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. లిక్కర్ కు  కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే.. డ్రగ్స్ కి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ కాంగ్రెస్ తీసుకున్న నినాదంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చర్చ  లేపగలరా అనేది సందేహంగా మారింది. రేవంత్ రెడ్డి ఇంటిపైకి అధికార పార్టీ కార్యకర్తలు ముట్టడికి వెళ్తే.. సీపీఐ నారాయణ లాంటి వాళ్ళు స్పందించారు తప్ప, కాంగ్రెస్ దిగ్గజాలు ఎవరు ఖండింస్తూ చిన్న స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో రేవంత్ వర్సెస్ సిఎల్పీలా సాగుతున్న హస్తం పార్టీలోని గొడవ.. అసెంబ్లీ వేదికగా ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.

Updated Date - 2021-10-07T21:01:28+05:30 IST