87.5 లక్షల కుటుంబాలకు.. వైద్యచికిత్స పరిమితి రూ.5 లక్షలకు పెంపుఛ

ABN , First Publish Date - 2021-11-23T09:20:22+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలుకావడం లేదంటూ ‘ఆయుష్మాన్‌ భారత్‌ అపహాస్యం’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.

87.5 లక్షల కుటుంబాలకు.. వైద్యచికిత్స పరిమితి రూ.5 లక్షలకు పెంపుఛ

  • ఆయుష్మాన్‌ భారత్‌కు ప్రత్యేక కార్డులు అక్కర్లేదు 
  • ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కథనంపై ఆరోగ్యశ్రీ సీఈవో వివరణ 

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలుకావడం లేదంటూ ‘ఆయుష్మాన్‌ భారత్‌ అపహాస్యం’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. ఈమేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఈ ఏడాది మే 18 నుంచి అమలవుతోందని, దాని పరిధిలోకి 26.11 లక్షల కుటుంబాలే వస్తాయని తెలిపారు. కానీ ఈ పథకం అమలవుతున్నప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న 87.5 లక్షల కుటుంబాలకు వైద్య చికిత్స పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ప్రత్యేక కార్డులు అవసరం లేదని స్పష్టంచేశారు. అలాగే, రాష్ట్రంలోని 246 నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి వస్తాయన్నారు. వారికి ఇప్పటికే అవగాహనా తరగతులు నిర్వహించామన్నారు. ఇంతవరకు సర్కారు వైఖరి బాగానే ఉన్నా... ఎంప్యానెల్‌ అయిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఎందుకు చికిత్సలు చేయడం లేదనే ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుంచి సమాధానం లేదు. ఎంప్యానెల్‌ అయితే కచ్చితంగా ఆ స్కీమ్‌ కింద చికిత్సలకు సంబంధించిన మార్గదర్శకాలను ఎందుకు విడుదల చేయలేదనే దానికి కూడా జవాబు లేదు. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కార్డులు లేక వలస కార్మికులు, కూలీలు ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పరిస్థితులు కూడా లేవు. ఇలాంటి అంశాలపై మాత్రం ప్రభుత్వం వద్ద నుంచి సమాధానం రావడం లేదు. 

Updated Date - 2021-11-23T09:20:22+05:30 IST