12 ఏళ్ల బాలుడికి 65 రోజులు ఎక్మో థెరపీ

ABN , First Publish Date - 2021-12-25T07:09:13+05:30 IST

కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌, శ్వాసకోశ రుగ్మత న్యుమోనియా

12 ఏళ్ల బాలుడికి 65 రోజులు ఎక్మో థెరపీ

  • కొవిడ్‌, న్యుమోనియా దాడితో గట్టిపడ్డ ఊపిరితిత్తులు
  • కిమ్స్‌ వైద్యుల చికిత్సతో తప్పిన ప్రాణాపాయం 
  • బాలుడు శౌర్యకు చికిత్స చేసిన కిమ్స్‌ వైద్యుల బృందం 

  

రాంగోపాల్‌పేట/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌, శ్వాసకోశ రుగ్మత న్యుమోనియా రెండూ ఏకకాలంలో 12 ఏళ్ల బాలుడు శౌర్యపై దాడి చేశాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ బాలుడి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని గట్టిగా అయిపోయాయి. తగినంత ఆక్సిజన్‌ అందక అవస్థలు పడుతున్న అతడిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడి వైద్యులు దాదాపు 65 రోజుల పాటు బాలుడికి ఎక్మో థెరపీ అందించారు. దీంతో ఊపిరితిత్తులు మళ్లీ పూర్వ స్థితికి  చేరుకున్నాయి.


శుక్రవారం విలేకరుల సమావేశంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి సర్జన్‌ డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ ఈ వివరాలను వెల్లడించారు. కొవిడ్‌ తీవ్రస్థాయిలో ఉండి, న్యుమోనియా కూడా సోకిన పిల్లలకు ఎక్కువ రోజు లు ఎక్మో థెరపీని అందించి ముప్పు నుంచి రక్షించడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. ఎక్మో సపోర్ట్‌ వల్ల ఆ బాలుడి ఊపిరితిత్తులకు  విశ్రాంతి లభించిందని, ఫలితంగా వాటంతటవే బాగుపడి మళ్లీ పనిచేయడం ప్రారంభించాయని ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ విజయ్‌ చెప్పారు. డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ వైద్య బృందం ఈ ఘనతను సాధించడంపై ఆస్పత్రి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అభినయ్‌ బొల్లినేని అభినందించారు. ప్రాణాపాయ స్థితి నుంచి బాలుడు బయటపడినందుకు సంతోషంగా ఉందని కిమ్స్‌ ఆస్పత్రి సీనియర్‌ పల్మనాలజిస్టు డాక్టర్‌ బీపీ సింగ్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-25T07:09:13+05:30 IST