317 జీవోపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
ABN , First Publish Date - 2021-12-31T08:33:43+05:30 IST
కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, టీచర్లను సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

- ప్రతివాదుల వివరణ తర్వాత నిర్ణయం: ధర్మాసనం
- సుప్రీంకు వెళ్తాం: పీవీ కృష్ణయ్య
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, టీచర్లను సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ జీవోను సవాలు చేస్తూ సీనియర్ న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ సతీ్‌షచంద్ర శర్మ ధర్మాసనం గురువారం విచారించింది. భారత రాజ్యాంగంలోని 371డి నిబంధనకు సవరణలు చేయకుండా ఉద్యోగుల పునర్‌వ్యవస్థీరణ చేపట్టడం సరికాదని న్యాయవాది పీవీ కృష్ణయ్య న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 97 ఆధారంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన చేస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్థమని పేర్కొన్నారు. రాష్ట్రపతి గతంలో ఇచ్చిన 371డి ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు చేపట్టలేదని కోర్టుకు తెలిపారు.
ఈ అంశానికి భారత రాజ్యాంగంలో ఎంతో ప్రాధాన్యం ఉందని, దీన్ని కోర్టు ప్రత్యేకంగా పరిశీలించాలని కోరారు. విభజన తర్వాత తెలంగాణలో జిల్లాలు, జోన్లు పెరిగాయని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేటాయింపులు చేపడితే ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 317 జీవో అమలుపై స్టే విధించాలని ఆయన కోర్టును అభ్యర్థంచారు. అయితే స్టే ఇవ్వడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రతివాదుల వివరణ తీసుకున్న తర్వాత ఈ అంశంపై నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది. ఈ మేరకు ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య వెల్లడించారు.