ఏడాదంతా భయం.. భయం!
ABN , First Publish Date - 2021-12-31T20:24:04+05:30 IST
కరోనా విలయ తాండవం చేసింది.. జనజీవనాన్ని లాక్‌డౌన్ ఆగం చేసింది..

చేదు జ్ఞాపకంగా మిగిలిన 2021
కరోనాకు 66 మంది బలి
పంట నష్టంతో అన్నదాతల బలవన్మరణం
రక్తమోడిన రహదారులు
ఎదురుకాల్పులు, కూంబింగ్‌లతో అట్టుడికిన ఏజెన్సీ
పెద్దపులికి చావుదెబ్బ
కన్నుమూసిన మాజీ మంత్రి చందూలాల్
ములుగు, డిసెంబరు 30: కరోనా విలయ తాండవం చేసింది.. జనజీవనాన్ని లాక్‌డౌన్ ఆగం చేసింది.. అకాలవర్షాలు అన్నదాతలను ముంచగా.. రోడ్డు ప్రమాదాలు పలువురిని బలితీసుకున్నాయి. ఎన్‌కౌంటర్లు కూంబింగ్‌లతో అటవీపల్లెలు అల్లాడిపోయాయి. గాండ్రిస్తూ గంభీరంగా తిరగాల్సిన పెద్దపులికి అడవిలోనే మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ రాజకీయ నేత చందూలాల్ కనుమూశారు. ఇలా 2021 ములుగు జిల్లా ప్రజలకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
66 మందిని బలి తీసుకున్న కొవిడ్
కొవిడ్-19 విలయం 2021లోనూ కొనసాగింది. మొదట్లో జనం పెద్దసంఖ్యలో అనారోగ్యం పాలవ్వగా మరణాలు మాత్రం ఈ ఏడాదే నమోదయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 66 మంది మహమ్మారికి బలైనట్లు చెబుతుండగా.. అనధికారికంగా మరణాల సంఖ్యలో వంద దాటింది. వైరస్ భయంతో ఆయా ఆచారాల ప్రకారం ఆత్మీయుల అంత్యక్రియలు కూడా జరిపించలేని పరిస్థితి నెలకొంది. కనీసం మృతదేహాలను ఇంటి ముందుకు తీసుకురాకుండానే ఊరి పొలిమేరల్లోనే అంతిమ సంస్కారాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మేడారం పూజారి సిద్దబోయిన సమ్మయ్య-సృజన దంపతులు 15 రోజుల వ్యవధిలో కరోనాతో మరణించారు. వాజేడు కు చెందిన దంపతులు కూడా ఒక్కరోజు వ్యవధిలో కరోనాకు బలయ్యారు. కేసులు పెరగడంతో మే 12 నుంచి రెండో విడత లాక్‌డౌన్ అమలులోకి రాగా జూన్ 19 వరకు కొనసాగించింది ప్రభుత్వం.
రాజకీయ ప్రముఖుల మృతి
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి జిల్లా వాసులను తీవ్రంగా కలిచివేసింది. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయ రంగంలో కొనసాగిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్రమంత్రిగా ఉన్నత పదవుల్లో కొనసాగారు. ఆయన ఏప్రిల్ 15న అర్ధరాత్రి తీవ్ర అనారోగ్యంతో కనుమూశారు. మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్ ఆలం రామ్మూర్తి జూలై 11న గుండెపోటుతో మరణించారు. కాంగ్రెస్ గోవిందరావుపేట మండల అధ్యక్షుడు ధర్మ అంజిరెడ్డి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలిచివేసింది.
రాష్ట్ర సరిహద్దుల్లో అలజడి
మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న అప్రకటిత యుద్ధంతో జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా కాలం వెళ్లదీశారు. కూంబింగ్‌లు, ఎదురుకాల్పుల ఘటనలతో నిత్యం ఏదోఒక చోట అలజడి రేగింది. తాడ్వాయి మండలం కౌశెట్టివాయి-చౌలేడు, కాల్వపల్లి అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు గుర్తించి వెలికి తీశారు. వెంకటాపురం పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీన పర్చుకున్నారు. మావోయిస్టు సభ్యులు ముచ్చాకి జోగా, పూనం బుద్రి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వాజేడు-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దు అడవుల్లో అక్టోబరు 25న ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా పెద్దఎత్తున ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇదే మండలం సరిహద్దులో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటుచేసిన బూబీట్రాప్స్, మందుపాతరలను పోలీసుల నిర్వీర్యం చేశారు. ఏడుగురు మిలీషియా సభ్యులను అరెస్టుచేశారు. డిసెంబరు 21న వెంకటాపురం మండలానికి చెందిన మాజీ సర్పంచ్ కొర్సా రమే్‌షను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు మరుసటి రోజే ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేశారు. ఇదే మండలంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపులో డిసెంబరు 26న ఎస్సై ఉమే్‌షచంద్రతో గొడవపడ్డ జవాను స్టీఫెన్ ఏకే-47గన్నుతో కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్నాడు. ఈఘటనలో బీహార్ రాష్ర్టానికి చెందిన ఎస్సై కన్నుమూశాడు.
పాపం.. పెద్ద పులి
దశాబ్దాల తర్వాత ములుగు అడవులను ఆవాసంగా మలుచుకున్న పెద్దపులికి వేటగాళ్ల రూపంలో చావెదురైంది. తాడ్వాయి కొడిశాల అటవీ లో సంచరిస్తున్న పులిని గొత్తికోయలు హతమార్చారు. అక్టోబరు 1న కూ ంబింగ్‌కు వెళ్లిన పోలీసులు పులిచర్మం, కళేబరాన్ని గుర్తించగా పులి హ త్యతో సంబంధం ఉన్న మొత్తం పది మందిని ఫారెస్టు అధికారులు అరె స్టు చేసి జైలుకు పంపారు. గొత్తికోయగూడాల్లో నిర్బంధ తనిఖీలు జరి పి వేటకు ఉయోగించే ఆయుధాలను పెద్దఎత్తున స్వాధీ న పర్చుకున్నా రు. ఛత్తీ్‌సగఢ్ అడవుల్లో చంపిన రెండు పెద్దపులుల చర్మాలను తెలంగాణ లో విక్రయించేందుకు ప్రయత్నించిన జిల్లాకు చెందిన ఏడుగురిని పోలీసు లు అరెస్టు చేశారు. జూలై 29, డిసెంబరు 21 తేదీల్లో ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు జరిపి పులి చర్మాలు, గోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అన్నదాతల ఆత్మహత్యలు
వ్యవసాయంలో నష్టాలతో పెరిగిన అప్పులను తీర్చే మార్గంలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం శివాపురానికి చెందిన బేతి కుమార్ వడ్ల కుప్పపైనే పురుగుల మందు తాగి డిసెంబరు 1న ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్పాకకు చెందిన సొనప హనుమయ్య అనే మిర్చి రైతు డిసెంబరు 13న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఆగస్టు 16న ఇదే మండల కేంద్రానికి చెందిన జాడి రామ్మూర్తి అనే మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

మరచిపోని విషాదాలు..
ఏడాదిలో ప్రతిరోజూ ఏదో ఒక విషాద ఘటన జరుగుతూనే ఉంది. ప్రధానమైన ఘటనలను పరిశీలిస్తే.. జనవరి 17న మేడారం వద్ద జంపన్నవాగులో మునిగి రెడ్డిగూడానికి చెందిన ఇద్దరు చిన్నారులు జాహ్నవి, హేమంత్‌లు మరణించారు. 4న ములుగు మండలంలో, 13న వాజేడు మండలంలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు బాలురు మృతిచెందారు. పిడుగుపాటుకు వెంకటాపూర్ మండలం కేశవాపురానికి చెందిన రైతు తిరుపతిరెడ్డి జూలై 12న మృతిచెందాడు. 5న కరెంటుషాక్‌తో దూలాపురానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. మేడారం జంపన్నవాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన శ్యామల్‌రావు, కోటేశ్వర్‌రావు గల్లంతై మరణించారు. 13న ములుగు మండలం జంగాలపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ట్రాక్టర్ ప్రమాదంలో గోవిందరావుపేట మండలానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు సాబాది సమ్మిరెడ్డి మృతిచెందాడు. 27న మల్లంపల్లికి చెందిన ఓబాలుడు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి మరణించాడు. ఆగస్టు 1న దుసపాటిలొద్ది జలపాతంలో మునిగిన ఇద్దరు యువకులు మరణించారు. వైద్యం వికటించి ఆగస్టు 6న చల్వాయికి చెందిన 45రోజుల పసికందు మరణించాడు. ఆన్‌లైన్ తరగతుల భయంతో టెన్త్ విద్యార్థిని ఆగస్టు 11న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకోగా 14వ తేదీన కర్నాటకకు చెందిన సైబర్ నేరగాడు కేవీ.మహేంద్రను ములుగుపోలీసులు అరెస్టుచేసి రూ.8.90లక్షలను రికవరీ చేశారు. 26న వాజేడు మండలంలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ జయరాం మరణించాడు. జంపన్నవాగులో మునిగి భద్రాద్రికొత్తగూడెంకు చెందిన ఐలయ్య మృతిచెందాడు. సెప్టెంబరు 13న పిడుగుపాటుకు ఏటూరునాగారం మండలం శంకర్‌రాజుపల్లికి చెందిన రమ్య అనే యువతి మృతిచెందింది. అక్టోబరు 5న వాజేడు మండలంలోని జలపాతంలో మునిగి హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాహుల్ మృతిచెందాడు.

27న కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. డిసెంబరు 6న ఏటూరునాగారం మండలంలో రోడ్డురోలర్‌ను మావోయిస్టు సానుభూతిపరుడు దహనం చేశాడు. మావోయిస్టులమని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు యువకులను ఏటూరునాగారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కన్నకూతురిపైనే లైంగికదాడికి పాల్పడ్డ తండ్రిని ములుగు పోలీసులు జైలుకు పంపించారు. 8న కన్నాయిగూడెం మండలం చింతగూడానికి చెందిన గజ్జెల రామారావు హత్యకు గురయ్యాడు. కూల్‌డ్రింక్ అనుకొని వెంకటాపురానికి చెందిన బాలుడు పురుగులమందు తాగి మరణించగా డిసెంబరు 24న ఇదే మండలానికి చెందిన భార్యాభర్తలు గుండెపోటుతో 24గంటల వ్యవధిలో మృతిచెందారు. అనారోగ్యంతో తన కన్నకూతురు మరణించడాన్ని తట్టుకోలేక గుండెపోటుతో ఓ తల్లికూడా కన్నుమూసింది. గోవిందరావుపేట మండలం చల్వాయి వద్ద 22వ తేదీ రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మణుగూరుకు చెందిన రైతు కుంజ శ్రీనివాస్ మృతి చెందాడు.
