104 సేవలకు స్వస్తి!

ABN , First Publish Date - 2021-12-30T07:41:12+05:30 IST

104.. రోగులున్న ప్రదేశానికే వెళ్లి వైద్య సేవలు అందించే

104 సేవలకు స్వస్తి!

  •  జనవరి ఒకటో తేదీ నుంచి నిలిపివేత.. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌, జగిత్యాల, డిసెంబరు 29 (ఆంఽధ్రజ్యోతి): 104.. రోగులున్న ప్రదేశానికే వెళ్లి వైద్య సేవలు అందించే వాహనం! దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు మందులిచ్చే వాహనం! రక్తపోటు, మధుమేహం, మూర్చ, ఆస్తమా తదితర వ్యాధులతోపాటు గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడ మందులు ఇచ్చే కార్యక్రమం! నెలలో ఒక్కో వాహనం కనీసం 50 గ్రామాల్లో సేవలు అందిస్తుంది! జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాలు నిలిచిపోనున్నాయి!


కొత్త సంవత్సరంలో 104 సిబ్బందికి సర్కారు షాక్‌ ఇవ్వబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో ఉన్న అన్ని 104 వాహనాలను హైదరాబాద్‌కు పంపాలని నిర్దేశించింది. ఫలితంగా, మెజారిటీ వాహనాలు ఇప్పటికే హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నాయి కూడా. నిజానికి, 104 సేవలను ఉపసంహరిస్తున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే చెప్పింది. ఈ ఏడాది మార్చి 7న ‘104 సేవలకు మంగళం’ పేరిట ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. వీటి సేవలను పూర్తిగా నిలిపి వేయాలని అప్పటికే ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. ఈ సిబ్బంది అంతా డీఎంహెచ్‌వోల పరిధిలో పని చేస్తుండడంతో వారితో సమీక్ష నిర్వహించి, తొలగించాలా వద్దా అన్న అభిప్రాయాలను తీసుకుంది కూడా.


ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008 అక్టోబరులో 104 వాహన సేవలను ప్రారంభించారు. తొలి నాళ్లలో హెచ్‌ఎమ్‌ఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో వీటి సేవలు కొనసాగాయి. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో కేవలం 120 వాహనాలే సేవలందిస్తున్నాయి. మిగతావన్నీ రిపేర్లు వచ్చి మూలనపడ్డాయి. 


ఉద్యోగులను ఏం చేస్తారు?

రాష్ట్రవ్యాప్తంగా 104 సేవల కింద దాదాపు 1,375 మంది వరకు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో సేవలందిస్తున్నారు. ఒక్కో వాహనంలో డ్రైవర్‌, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీటి సేవలను నిలిపివేయడంతో వారందర్నీ ఏంచేస్తారన్న అంశానికి సంబంధించి వైద్య శాఖ వద్ద ఇప్పటి వరకూ ఒక స్పష్టత లేదు. ప్రస్తుతానికి వీరిని పీహెచ్‌సీల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.


ఈ నేపథ్యంలో సోమవారం 104 సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావును కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న తమను జాతీయ ఆరోగ్య మిషన్‌లో కాంట్రాక్టు పద్ధతి కింద తీసుకోవాలని కోరారు. వారి విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే, ఎన్‌హెచ్‌ఎంలో డ్రైవర్‌ పోస్టులు లేవు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారన్న దానిపై మీమాంస కొనసాగుతోంది.


Updated Date - 2021-12-30T07:41:12+05:30 IST