అన్ని శాఖల్లో 100% ఆడిటింగ్‌ జరగాలి

ABN , First Publish Date - 2021-12-08T09:13:42+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 100 శాతం మేర ఆడిటింగ్‌ జరగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖల్లో 100% ఆడిటింగ్‌ జరగాలి

  •  ప్రతి పైసా ప్రజలకు చేరడమే లక్ష్యంగా ఉండాలి
  • ‘రంగారెడ్డి’లో ప్రయోగాత్మకంగా 
  • ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను ప్రారంభించాలి:హరీశ్‌రావు


హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 100 శాతం మేర ఆడిటింగ్‌ జరగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం ఆర్థిక శాఖ హెచ్‌వోడీలు, జిల్లా ఆర్థిక, ఆడిటింగ్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి పైసా ప్రజలకు చేరడమే లక్ష్యంగా ఆడిటింగ్‌ చేపట్టాలని సూచించారు. తాను జిల్లాలకు వచ్చినప్పుడు ఆడిటింగ్‌ను సమీక్షిస్తానని చెప్పారు. ముందుగా రంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖలో 100ు ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను పూర్తి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రశంసించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆడిటింగ్‌ శాఖ అధికారులను మంత్రి అభినందించారు. అదే ఒరవడితో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పూర్తి ఆడిటింగ్‌ను నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థలకు ఇతర శాఖల నుంచి వచ్చే అభ్యంతరాలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ మూడు నెలల్లోనే 2400 అభ్యంతరాలను ఆడిట్‌ చేసి పరిష్కరించడం ద్వారా రూ.కోటి 26 లక్షలను ప్రభుత్వ ఖజానాకు జమ చేశారంటూ ఆ జిల్లా అదనపు కలెక్టర్‌ను, ఆడిట్‌ సిబ్బందిని అభినందించారు. ఈ ఐదారు నెలల్లో ఆయా శాఖలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ చర్యలు తీసుకోవాలన్నారు. శాఖలవారీగా ఎక్కడైనా నిధుల దుర్వినియోగం జరిందా అన్నది నిక్కచ్చిగా పరిశీలించాలని చెప్పారు.  

Updated Date - 2021-12-08T09:13:42+05:30 IST