అన్షూకు రజతమే

ABN , First Publish Date - 2021-10-08T06:30:54+05:30 IST

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన అన్షూమాలిక్‌..అంతిమసమరంలో ఓటమి చవిచూసి రజతంతో సరిపెట్టుకుంది.

అన్షూకు రజతమే

ఫైనల్లో పరాజయం

అయినా రికార్డు ప్రదర్శన

సరితా మోర్‌కు కాంస్యం

ప్రపంచ చాంపియన్‌షి్‌ప 

ఓస్లో (నార్వే): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన అన్షూమాలిక్‌..అంతిమసమరంలో ఓటమి చవిచూసి రజతంతో సరిపెట్టుకుంది. అలాగే సరితా మోర్‌ కాంస్యం గెలవడంతో గురువారంనాడు భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.మహిళల 57 కిలోల ఫైనల్లో అమెరికాకు చెందిన 2016 ఒలింపిక్‌ చాంపియన్‌ హెలెన్‌ మౌరోలిస్‌ ‘బై ఫాల్‌’తో అన్షూమాలిక్‌పై విజయం సాధించింది. దాంతో 19 ఏళ్ల  అన్షు రజత పతకం అందుకుంది. అయినా ఆమె సాధించిన ఈ పతకం ఎంతో ఘనమైనదే. కారణం..వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ఇప్పటికు వరకు ఏ భారత మహిళా రెజ్లర్‌ రజతం గెలవలేదు. గతంలో గీత ఫొగట్‌, బబితా ఫొగట్‌, పూజా, వినేశ్‌ ఫొగట్‌ పతకాలు సాధించినా..వారు కాంస్యానికే పరిమితమయ్యారు. దాంతో మాలిక్‌  రజత  పతకం భారత రెజ్లింగ్‌ చరిత్రలో రికార్డే. 


దూకుడుగా ప్రారంభించి..:

హెలెన్‌తో టైటిల్‌ ఫైట్‌ను టీనేజర్‌ అన్షు దూకుడుగా ఆరంభించింది. దాం తో తొలి పీరియడ్‌ ముగిసే సరికి భారత రెజ్లర్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ రెండో పీరియడ్‌లో పరిస్థితి మారిపోయింది. గట్టి పట్టు పట్టిన హెలెన్‌..అన్షును పడదోసి 2-1కి ఆపై 4-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. తన పట్టుతో అన్షును అదిమిపట్టి ‘బై ఫాల్‌’తో విజయం సాధించి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.  


సవితకు కాంస్యం..:

మహిళల 59 కిలోల్లో సరితా మోర్‌ కాంస్యంతో భారత్‌కు రెండో పతకం అందించింది. సారా లిండ్‌బోర్గ్‌ (స్వీడన్‌)ను 8-2తో చిత్తు చేసిన మోర్‌ కాంస్యం నెగ్గింది. దివ్యా కక్రన్‌ (72కి.) రెపిచేజ్‌లో ఓడింది. మరోవైపు గ్రీకో రోమన్‌ విభాగంలో సందీప్‌ (55కి.), వికాస్‌ (72కి.), సాజన్‌ (77కి.) హర్‌ప్రీత్‌ సింగ్‌ (82కి.) ఓడి టోర్నీ నుంచి వైదొలిగారు.

Updated Date - 2021-10-08T06:30:54+05:30 IST