T20 World Cup: నరాలు తెగే ఉత్కంఠ మధ్య గెలిచిన విండీస్

ABN , First Publish Date - 2021-10-30T01:01:55+05:30 IST

టీ20 ప్రపంచకప్‌లో అసలైన మజా అభిమానులకు లభించింది. సూపర్ 12 గ్రూప్1లో వెస్టిండీస్-బంగ్లాదేశ్

T20 World Cup: నరాలు తెగే ఉత్కంఠ మధ్య గెలిచిన విండీస్

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో అసలైన మజా అభిమానులకు లభించింది. సూపర్ 12 గ్రూప్1లో వెస్టిండీస్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ టీ20లోని అసలైన రుచిని చూపించింది. విజయం ఎవరిని వరిస్తుందో తెలియక ఇరు జట్ల అభిమానులు చివరి బంతి వరకు వేచి చూడాల్సి వచ్చింది. చివరి బంతిని తెలివిగా సంధించి మహ్మదుల్లా పరుగులు చేయకుండా నిరోధించిన రసెల్ విండీస్‌కు అద్భుత విజయాన్ని అందించి పెట్టాడు. సూపర్‌ 12లో విండీస్‌కు ఇది తొలి విజయం కాగా, బంగ్లాదేశ్‌కు ఇది మూడో ఓటమి. 


విండీస్ నిర్దేశించిన 142 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్..చివరి బంతి వరకు పోరాడి 139 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. లిటన్ దాస్ (44) క్రీజులో ఉన్నంత వరకు బంగ్లాదేశ్ ఆశలు సజీవంగా ఉన్నప్పటికీ అతడు అవుటయ్యాక మ్యాచ్ ఉత్కంఠవైపుగా సాగింది. ఆ తర్వాత కెప్టెన్ మహ్మదుల్లా (31, నాటౌట్) బంగ్లాదేశ్ శిబిరంలో ఆశలు నింపినప్పటికీ చివరి బంతిని తెలివిగా సంధించిన రసెల్ బంగ్లా ఆశలను అడియాశలు చేశాడు. బంగ్లాదేశ్ విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా 9 పరుగులు మాత్రమే వచ్చాయి. 


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నికోలస్ పూరన్ (40) పుణ్యమా అని  నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ 39, పొలార్డ్ 14, హోల్డర్ 15 పరుగులు చేశారు. 22 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసిన పూరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

Updated Date - 2021-10-30T01:01:55+05:30 IST