పుల్లెల గోపీచంద్‌ హఠాత్తు నిర్ణయం వెనుక..!

ABN , First Publish Date - 2021-07-08T09:29:45+05:30 IST

క్రికెట్‌కు దీటుగా దేశంలో బ్యాడ్మింటన్‌ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన వారిలో జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అగ్రగణ్యుడు. భారత బ్యాడ్మింటన్‌కు కొత్త రంగులద్దిన వ్యక్తిగా పారుపల్లి కశ్యప్‌...

పుల్లెల గోపీచంద్‌ హఠాత్తు నిర్ణయం వెనుక..!

గోపీ ఎందుకు వెళ్లడం లేదు?


పుల్లెల గోపీచంద్‌. భారత బ్యాడ్మింటన్‌ రూపురేఖలు మార్చిన ప్లేయర్‌,కోచ్‌. సైనా, సింధు, శ్రీకాంత్‌ వంటి మేటి షట్లర్లను తయారు చేసిన 20వ శతాబ్ది ద్రోణాచార్యుడు. ఆటగాడిగా కంటే కోచ్‌గా దేశానికి ఎన్నో అద్భుత విజయాలు అందించిన గోపీచంద్‌ యువ షట్లర్లకు ఆదర్శం, స్ఫూర్తి. నిన్న, మొన్నటి వరకు భారత స్టార్‌ షట్లర్ల ఆలనాపాలన మొత్తం తానై చూసిన గోపీ హఠాత్తుగా టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లడం లేదని ప్రకటించడం బ్యాడ్మింటన్‌ అభిమానులను షాక్‌కు గురి చేసింది.


  • ఒలింపిక్స్‌ 15 రోజుల్లో

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)

క్రికెట్‌కు దీటుగా దేశంలో బ్యాడ్మింటన్‌ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన వారిలో జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అగ్రగణ్యుడు. భారత బ్యాడ్మింటన్‌కు కొత్త రంగులద్దిన వ్యక్తిగా పారుపల్లి కశ్యప్‌, సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌ వంటి ప్రపంచ మేటి షట్లర్లను తయారు చేయడంలో గోపీ పడిన శ్రమ సాధారణమైనది కాదు. ప్రస్తుతం స్టార్లుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు గోపీ దగ్గర ఓనమాలు నేర్చుకున్నవారే. గత మూడు ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌కు రథసారథిగా వ్యవహరించిన గోపీ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లడం లేదని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ను బ్యాడ్మింటన్‌ హబ్‌గా మార్చి దేశం మొత్తం ఇటువైపు చూసేలా చేసిన గోపీచంద్‌ అకాడమీలో కాకుండా ఒలింపిక్స్‌ షట్లర్లు బయట సాధన చేస్తుండడం.. గోపీ పర్యవేక్షణలో కాకుండా విదేశీ కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటుండడం చూస్తుంటే అతడి సేవలను విస్మరిస్తున్నట్టు ఉందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


విదేశీ కోచ్‌లకు పెరిగిన ప్రాధాన్యం

2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం నెగ్గినప్పుడు.. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజతంతో మెరిసినప్పుడు వాళ్ల వెనుక ఉంది గోపీ ఒక్కడే. సింధు, సైనా, శ్రీకాంత్‌ను వరల్డ్‌ నెంబర్‌వన్‌ ర్యాంకర్లుగా తీర్చిదిద్దింది గోపీనే. కశ్యప్‌ కామన్వెల్త్‌లో, సాయిప్రణీత్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పతకాల మోత మోగించింది గోపీ శిక్షణలోనే. రియో ఒలింపిక్స్‌కు 3 నెలల ముందు సింధు గాయపడితే ఆమె మళ్లీ కోలుకొని పతకం సాధించే వరకు గోపీ పడిన కష్టం అందరికీ తెలిసిందే. అలాంటి గోపీ ఈసారి టోక్యో వెళ్లడం లేదంటే జాతీయ బ్యాడ్మింటన్‌ సంఘం, భారత ఒలింపిక్‌ సంఘం, కేంద్ర క్రీడా శాఖ ఎందుకు మౌనంగా ఉన్నాయనేది పెద్ద ప్రశ్నగా మారింది. బ్యాడ్మింటన్‌ బృందం నుంచి ఒలింపిక్స్‌ వెళ్లేందుకు పది మందికే అవకాశముండగా సింధు, ప్రణీత్‌, సాత్విక్‌, చిరాగ్‌తో పాటు వారి వ్యక్తిగత కోచ్‌లు, ఫిజియోల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంది. దీంతో వారి కోసం గోపీ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపి స్తున్నాయి. గోపీ లేకుండానే భారత బ్యాడ్మింటన్‌ బృందం టోక్యో వెళ్లడానికి సిద్ధమవుతోంది. అయితే, విదేశీ కోచ్‌లను నమ్మి భారత క్రీడాకారులను టోక్యోకు ఎలా పంపిస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశేష అనుభవం, ప్రస్తుతం వెళుతున్న క్రీడాకారుల ఆట గురించి పూర్తి అవగాహన ఉన్న గోపీ టోక్యో వెళితే మన షట్లర్ల పతక అవకాశాలు మెరుగుపడతాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రీడల సమయంలో ఎమర్జెన్సీ!


టోక్యో: ఒలింపిక్స్‌ సందర్భంగా కరోనా వైరస్‌ అత్యవసర పరిస్థితి విధించాలని జపాన్‌ ప్రభుత్వం భావిస్తోంది. లాక్‌డౌన్‌ కంటే కాస్త తక్కువగా ఉండే ఆంక్షలను ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యే ఈనెల 23నుంచి ఆగస్టు 22 వరకు విధించనున్నట్టు జపాన్‌ మీడియా బుధవారం వెల్లడించింది. ‘టోక్యోలో నాలుగోస్థాయి ఎమర్జెన్సీ విధించే అంశాన్ని అధికార పార్టీ తెలియజేసింది’ అని ఎన్‌హెచ్‌కే అనే మీడియా సంస్థ వెల్లడించింది. ఒలింపిక్స్‌ను ఫ్యాన్స్‌ లేకుండా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరిని ఉటంకిస్తూ క్యోడో న్యూస్‌ తెలిపింది. 


Updated Date - 2021-07-08T09:29:45+05:30 IST