అసలేం జరుగుతోంది?
ABN , First Publish Date - 2021-12-15T07:10:13+05:30 IST
యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కాక ముందే విరాట్ కోహ్లీ ఓ సంచలన ప్రకటన చేశాడు. ఆ మెగా టోర్నీ తర్వాత పొట్టి ఫార్మాట్ బాధ్యతల నుంచి వైదొలుగుతానని, వన్డే.. ...

వన్డే సిరీస్ కు కోహ్లీ దూరం!
అలాంటిదేమీ లేదన్న బీసీసీఐ
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు.. ఇప్పుడు టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వ్యవహారం కూడా అలానే ఉంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లయిన ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవనే విషయం జగమెరిగిందే. ఇప్పుడు పరిమిత ఓవర్లలో కోహ్లీని కాదని రోహిత్‌కు పగ్గాలు అప్పజెప్పడంతో తెర వెనుక రాజకీయాలు ముదిరాయనే భావన నెలకొంది. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీ్‌సకు గాయం పేరిట హిట్‌మ్యాన్ దూరం కాగా.. తాను వన్డే సిరీ్‌సలో ఆడబోనని విరాట్ స్పష్టం చేసినట్టు కథనాలు వినిపిస్తున్నాయి.. దీంతో అసలు భారతక్రికెట్‌లో ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు అయోమయం చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కాక ముందే విరాట్ కోహ్లీ ఓ సంచలన ప్రకటన చేశాడు. ఆ మెగా టోర్నీ తర్వాత పొట్టి ఫార్మాట్ బాధ్యతల నుంచి వైదొలుగుతానని, వన్డే.. టెస్టు జట్ల సారథిగా మాత్రం కొనసాగుతానని చెప్పాడు. కానీ అక్కడి నుంచి పరిస్థితులు అతడూహించనట్టుగా మారిపోయాయి. పరిమిత ఓవర్లలో ఇద్దరు కెప్టెన్లు ఉండడం సరికాదని భావిస్తూ.. బీసీసీఐ వన్డేల నుంచి కూడా కోహ్లీ సారథ్యానికి ఉద్వాసన పలికి రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. ఇది ఓరకంగా కోహ్లీకి ఊహించని పరాభవమే. వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టంగా చెప్పినప్పటికీ.. తనను అవమానకరంగా తొలగించారనే భావనలో అతడున్నట్టు సమాచారం. ఇది మనసులో పెట్టుకున్నాడో.. మరేంటో కానీ.. వన్డే సిరీ్‌సలో ఆడనని కోహ్లీ ఇదివరకే బోర్డుకు సమాచారమిచ్చినట్టు మంగళవారం ఉదయం నుంచీ కథనాలు వెలువడ్డాయి.
ఇద్దరూ కలిసి ఆడలేదు..
టీ20 ప్రపంచకప్ ముగిశాక భారత జట్టు కివీ్‌సతో టీ20, టెస్టు సిరీ్‌సలు ఆడింది. ఇందులో పొట్టి సిరీస్ కొత్త కెప్టెన్ రోహిత్ ఆధ్వర్యంలో జరగ్గా కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత జట్టు ఆడిన రెండు టెస్టుల్లో రోహిత్‌కు రెస్ట్ ఇచ్చారు. దీంతో కెప్టెన్సీ చేతులు మారాక ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్టు జట్టును ప్రకటిస్తూనే.. వన్డేలకు కూడా రోహిత్ సారథ్యం వహిస్తాడని బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది విరాట్‌ను తీవ్ర మనస్థాపానికి గురి చేసినట్టు చెబుతున్నారు. తాజాగా కండరాలు పట్టేయడంతో రోహిత్ మూడు టెస్టుల సిరీ్‌సకు దూరమయ్యాడు. వన్డే సిరీస్ వరకల్లా సిద్ధం కావాలనే ఆలోచనలో అతడుండగా.. ఆ సిరీ్‌సకు కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడనే వార్తలు వినిపిస్తుండడంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అసలు అప్పట్లోనే తన డిప్యూటీగా రోహిత్‌ను తప్పిస్తూ.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లలో ఒకరిని నియమించాలని కోహ్లీ కోరినట్టు కథనాలు వినిపించాయి.జట్టులో రోహిత్ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు అతను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్టు రోహిత్ అభిమానులు గుస్సా అవుతున్నారు. కానీ బోర్డులో ఓ వర్గం మాత్రం హిట్‌మ్యాన్‌కు అండగా నిలిచిందని సమాచారం.
కూతురు పుట్టిన రోజంటూ..
వచ్చేనెల 11న తన కూతురు వామికా మొదటి పుట్టిన రోజు ఉండడంతో వన్డే సిరీ్‌సకు విరాట్ దూరంగా ఉండాలనుకుంటున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే సఫారీ టూర్‌కు క్రికెటర్లంతా కుటుంబసభ్యులతోనే వెళుతున్నారు. అంతా ఒకేచోట ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మొత్తం సిరీస్ నుంచే వైదొలగడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తన కుమార్తె పుట్టినరోజైన 11వ తేదీనాడే మొదలయ్యే టెస్టులో ఆడనున్న కోహ్లీ.. ఆ తర్వాత వారానికి మొదలయ్యే (జనవరి 19 నుంచి) వన్డే సిరీ్‌సలో ఆడేందుకు అతనికున్న ఇబ్బంది ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకి ఎలాంటి కారణం చెబుతున్నా.. తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకే కోహ్లీ ఇలా చేస్తున్నాడని రోహిత్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా ఇగోలు పక్కనబెట్టి జట్టు ప్రయోజనాలే ముఖ్యంగా ఈ జోడీ ముందుకు సాగాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
విరాట్ మాకేమీ చెప్పలేదు: బీసీసీఐ
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తమను ఇప్పటిదాకా కోరలేదని బీసీసీఐ తెలిపింది. వచ్చే నెల 19 నుంచి రోహిత్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ‘ఇప్పటివరకైతే వన్డే సిరీ్‌సకు అందుబాటులో ఉండలేనని బోర్డు చీఫ్ గంగూలీకి, కార్యదర్శి జైషాకు కానీ కోహ్లీ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. ఒకవేళ తనకు కూడా గాయమై ఆడలేకపోతే అది వేరే విషయం. ప్రస్తుతానికైతే కోహ్లీ వన్డే సిరీస్ ఆడతాడు. కెప్టెన్ కోహ్లీ సహా అందరు ఆటగాళ్లు తమ ఫ్యామిలీలతో ఒకే చార్టెడ్ ఫ్లయిట్‌లో వెళతారు. ఒకవేళ టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి కావాలనుకుంటే అతడు తప్పకుండా సెలెక్షన్ కమిటీ చైర్మన్‌కు, జైషాకు సమాచారమిస్తాడు’ అని బోర్డు అధికారి తెలిపాడు. మరోవైపు భారత జట్టు దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చాక శ్రీలంకతో టెస్టు, టీ20 సిరీస్ కోసం మళ్లీ బయోబబుల్‌లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. అందుకే తగిన రెస్ట్ కోసం కోహ్లీ వన్డే సిరీస్ నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు మరో కథనం.