ఇప్పుడు నా వయసు 35.. సచిన్ చెప్పింది నిజమే: ఉతప్ప

ABN , First Publish Date - 2021-05-22T01:10:32+05:30 IST

నొప్పిని పంటి బిగువన భరిస్తూనే ఆడాడని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా గుర్తు చేసుకున్నాడు.

ఇప్పుడు నా వయసు 35.. సచిన్ చెప్పింది నిజమే: ఉతప్ప

ఆస్ట్రేలియాలో 2008లో జరిగిన `కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్‌` గెలుపు టీమిండియా చారిత్రాత్మక విజయాల్లో ఒకటి. ఆస్ట్రేలియాతో బెస్టాఫ్ త్రీ ఫైనల్స్ ఆడిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టైటిల్ గెలుచుకుంది. ఈ సిరీస్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మొత్తం 399 పరుగులు చేశాడు. అయితే ఆ సిరీస్ ఆసాంతం సచిన్ శారీరక సమస్యలను ఎదుర్కొన్నాడట. నొప్పిని పంటి బిగువన భరిస్తూనే ఆడాడని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా గుర్తు చేసుకున్నాడు. 


`సచిన్ టెండూల్కర్‌ను నేను పాజీ అని పిలిచేవాడిని. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో అతను తీవ్ర నొప్పితోనే ఆడాడు.`అంతా ఓకెనా.. సౌకర్యంగా ఉన్నారా?` అని మేం అడిగిన ప్రతీసారి.. `నేను బాగున్నాను`అని బదులిచ్చేవాడు. ప్రతీ సారి జట్టు అవసరాన్ని గుర్తిస్తూ ఆడేవాడ`ని ఉతప్ప చెప్పాడు. అలాగే ఆ సిరీస్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా సచిన్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు. 


``35 ఏళ్ల వయసులో ఫిట్‌గా ఉండటం కష్టం. గాయాలు తిరగబెడతాయి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయ`ని సచిన్ నాతో అన్నాడు. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. దానికి నేను `అలా ఏం ఉండదు పాజీ.. మీరు ఊరికే అలా చెబుతున్నారు` అన్నాను. వెంటనే సచిన్.. `రాబిన్.. నీకు 35 ఏళ్లు వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం` అన్నాడు. ఇప్పుడు నాకు 35 ఏళ్లు.. సచిన్ చెప్పింది అక్షరాల నిజమని మాత్రమే ఇప్పుడు చెప్పగలన`ని ఉతప్ప అన్నాడు. 

Updated Date - 2021-05-22T01:10:32+05:30 IST