నాలుగో రోజు వరుణుడిదే

ABN , First Publish Date - 2021-06-22T06:02:29+05:30 IST

The fourth day was Varun

నాలుగో రోజు వరుణుడిదే

ఒక్క బంతీ పడకుండానే ఆట రద్దు

టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 


సౌతాంప్టన్‌: The fourth day was Varun నాలుగో రోజైన సోమవారం ఆట కూడా పూర్తిగా రద్దయింది. రెండో రోజు రెండు సెషన్ల ఆట జరగ్గా.. మూడోరోజు ఆఖరి సెషన్‌ను ముందుగానే ముగించారు. ఇక తెల్లవారుజాము నుంచే ఇక్క డ ఏకధాటిగా వర్షం కురిసింది. అప్పుడప్పుడు కాస్త తెరిపిచ్చినా.. అంతలోనే ప్రభావం చూపడంతో పిచ్‌పై కప్పిన కవర్లపై భారీగా నీరు చేరింది. అటు అవుట్‌ ఫీల్డ్‌ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. రెండు సెషన్ల పాటు ఎదురుచూసినప్పటికీ ఎలాంటి మార్పూ కనిపించలేదు. మరోవైపు ఈ విరామంలో చేసేదేమీ లేక ఇరు జట్ల ఆటగాళ్లు టైమ్‌పాస్‌ చేస్తూ కనిపించారు.కివీస్‌ పేసర్‌ జేమిసన్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆడగా.. ఇతర క్రికెటర్లు మొబైల్‌ ఫోన్లతో సమయం గడిపారు. మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదో రోజు ఆటకు వాతావరణం అనుకూలించే అవకాశం ఉండడం ఊరటనిచ్చే విషయం.

]

ఇప్పటికే రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో బుధవారం రిజర్వ్‌ డేలోనూ మ్యాచ్‌ జరుగుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్‌ (12 బ్యాటింగ్‌), టేలర్‌ (0 బ్యాటింగ్‌) ఉన్నారు. అంతకుముందు భారత్‌ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.


Updated Date - 2021-06-22T06:02:29+05:30 IST