హిట్‌మ్యాన్‌ టచ్‌లోకి..

ABN , First Publish Date - 2021-10-21T09:19:19+05:30 IST

టీ20 వరల్డ్‌క్‌పలోని రెండవ, ఆఖరి వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మెగా టోర్నీకి ముందు బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఎటువంటి అనుమానాలూ లేకపోయినా.. ఆరో బౌలర్‌ లేని వెలితి కనిపించింది. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌కు దూరంగా ఉండగా..

హిట్‌మ్యాన్‌ టచ్‌లోకి..

  • టీమిండియా ఘన విజయం
  • 8 వికెట్లతో ఆస్ట్రేలియా చిత్తు


దుబాయ్‌: టీ20 వరల్డ్‌క్‌పలోని రెండవ, ఆఖరి వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మెగా టోర్నీకి ముందు బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఎటువంటి అనుమానాలూ లేకపోయినా.. ఆరో బౌలర్‌ లేని వెలితి కనిపించింది. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌కు దూరంగా ఉండగా.. కోహ్లీ రెండు ఓవర్లు వేసి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశాడు.  విరాట్‌కు బదులుగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌ (41 బంతుల్లో 60 రిటైర్డ్‌) టచ్‌లోకి రాగా.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (31 బంతుల్లో 39) అదరగొట్టడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ (38 నాటౌట్‌) ఆత్మవిశ్వాసంతో ఆడాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 152/5 పరుగులు చేసింది. స్మిత్‌ (57), మార్కస్‌ స్టొయినిస్‌ (41 నాటౌట్‌) ధాటిగా ఆడారు. అశ్విన్‌ (2/8) రెండు వికెట్లు పడగొట్టగా.. భువీ, జడేజా, రాహుల్‌ చాహర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, బుమ్రా, షమికి విశ్రాంతినిచ్చారు. 


దుమ్మురేపిన ఓపెనర్లు: లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌.. ఆరంభం నుంచే విరుచుకుపడ్డారు. ఆసీస్‌ పేస్‌ను అలవోకగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పవర్‌ప్లే తర్వాత జంపా బౌలింగ్‌లో రాహుల్‌ రెండు సిక్స్‌లతో మెరిశాడు. అయితే, ధాటిగా ఆడుతున్న రాహుల్‌ను అగర్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 6,4తో బ్యాట్‌ ఝుళిపించిన రోహిత్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. హిట్‌మ్యాన్‌ రిటైర్‌ కాగా.. సూర్య, హార్దిక్‌ (14 నాటౌట్‌) మరో 13 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు. సూర్య ధైర్యంగా బ్యాటింగ్‌ చేయగా.. షాట్లు ఆడేందుకు పాండ్యా కొంత ఇబ్బందిపడ్డాడు. 


నిలబెట్టిన స్మిత్‌: టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆరంభంలోనే తడబడినా.. ఆ తర్వాత పుంజుకొన్న ఆస్ట్రేలియా ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీ్‌సకు అశ్విన్‌ ఆరంభంలోనే ఝలక్‌ ఇచ్చాడు. రెండో ఓవర్‌లో ఓపెనర్‌ వార్నర్‌ (1), మిచెల్‌ మార్ష్‌ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. కెప్టెన్‌ ఫించ్‌ (8)ను జడేజా ఎల్బీ చేయడంతో ఆసీస్‌ 11/3తో ఆత్మరక్షణలో పడింది. ఈ దశలో స్మిత్‌-మ్యాక్స్‌వెల్‌ (37) నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆదుకొన్నారు. మ్యాక్సీ రివర్స్‌ స్వీప్‌లతో ఎదురుదాడి చేయగా.. స్మిత్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. మ్యాక్సీని చాహర్‌ అవుట్‌ చేసినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టొయినిస్‌ ధాటిగా ఆడడంతో ఆఖరి ఓవర్లలో ఆసీస్‌ భారీగానే పరుగులు రాబట్టింది. శార్దూల్‌ వేసిన 17వ ఓవర్‌లో గేర్‌ మార్చిన స్మిత్‌ మూడు వరుస ఫోర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో స్టొయినిస్‌ 6,4తో చెలరేగాడు. రెండు ఓవర్లు మాత్రమే బౌల్‌ చేసిన చక్రవర్తి 23 పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్‌ స్కోరు 150 పరుగుల మార్క్‌ దాటగలిగింది. కాగా, భువనేశ్వర్‌ మళ్లీ లయను అందిపుచ్చుకోవడం టీమిండియాకు సానుకూల పరిణామం. 


స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా: వార్నర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 1, ఫించ్‌ (ఎల్బీ) జడేజా 8, మిచెల్‌ మార్ష్‌ (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 0, స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) భువీ 57, మ్యాక్స్‌వెల్‌ (బి) చాహర్‌ 37, స్టొయినిస్‌ (నాటౌట్‌) 41, మాథ్యూ వేడ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 152/5; వికెట్ల పతనం: 1-6, 2-6, 3-11, 4-72, 5-148; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-1, అశ్విన్‌ 2-0-8-2, జడేజా 4-0-35-1, శార్దూల్‌ 3-0-30-0, కోహ్లీ 2-0-12-0, రాహుల్‌ చాహర్‌ 3-0-17-1, వరుణ్‌ చక్రవర్తి 2-0-23-0.

 

భారత్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) వార్నర్‌ (బి) అగర్‌ 39, రోహిత్‌ శర్మ (రిటైర్డ్‌) 60, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 38, హర్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 17.5 ఓవర్లలో 153/2; వికెట్ల పతనం: 1-68 2-127; బౌలింగ్‌: మిచెల్‌ స్టార్క్‌ 2-0-14-0, కమిన్స్‌ 4-0-33-0, ఆస్టన్‌ అగర్‌ 2-0-14-1, జంపా 3-0-29-0, కేన్‌ రిచర్డ్‌సన్‌ 1.5-0-20-0, స్టొయినిస్‌ 2-0-16-0, మిచెల్‌ మార్ష్‌ 2-0-17-0, మ్యాక్స్‌వెల్‌ 1-0-10-0.

Updated Date - 2021-10-21T09:19:19+05:30 IST