స్పిన్‌తో పట్టేశారు

ABN , First Publish Date - 2021-02-01T06:38:40+05:30 IST

సుదీర్ఘ విరామానికి తెర దించుతూ తమిళనాడు జట్టు రెండోసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని చేజిక్కించుకుంది. 2006-07 ఆరంభ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఆధ్వర్యంలోనే విజేతగా నిలిచిన ఈ జట్టు...

స్పిన్‌తో పట్టేశారు

  • తమిళనాడుకే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ
  • వణికించిన స్పిన్నర్‌ సిద్దార్థ్‌  
  • ఫైనల్లో బరోడా ఓటమి

అహ్మదాబాద్‌: సుదీర్ఘ విరామానికి తెర దించుతూ తమిళనాడు జట్టు రెండోసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని చేజిక్కించుకుంది. 2006-07 ఆరంభ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఆధ్వర్యంలోనే విజేతగా నిలిచిన ఈ జట్టు.. 13 ఏళ్ల తర్వాత అజేయ ఆటతీరుతో చాంపియన్‌గా నిలిచింది. టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఎం.సిద్దార్థ్‌ (4/20) బరోడాను వణికించగా.. ఆదివారం జరిగిన ఫైనల్లో దినేశ్‌ కార్తీక్‌ సేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (49) టాప్‌ స్కోరర్‌. ఆ తర్వాత తమిళనాడు 18 ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులు చేసి నెగ్గింది. హరి నిషాంత్‌ (35), బాబా అపరాజిత్‌ (29 నాటౌట్‌), దినేశ్‌ కార్తీక్‌ (22) రాణించారు. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన తమిళనాడు మ్యాచ్‌లో తొలి 13 ఓవర్లను వారితోనే వేయించడం విశేషం. సిద్దార్థ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

సునాయాసంగా..: స్వల్ప ఛేదనను తమిళనాడు ఆడుతూ.. పాడుతూ ముగించింది. ఓపెనర్‌ జగదీషన్‌ (14) నాలుగో ఓవర్‌లో వెనుదిరిగినా మరో ఓపెనర్‌ హరి నిషాంత్‌ మాత్రం బౌండరీలతో కదం తొక్కాడు. దీంతో పది ఓవర్లలో 61/1 స్కోరుతో జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఈ దశలో చక్కగా కుదురుకున్న నిషాంత్‌ను పేసర్‌ బాబాషఫీ అవుట్‌ చేశాడు. మధ్య ఓవర్లలో పిచ్‌ను అర్థం చేసుకుంటూ కెప్టెన్‌ కార్తీక్‌, అపరాజిత్‌ సింగిల్స్‌పై దృష్టి పెట్టారు. ఇక చివరి 30 బంతుల్లో 32 పరుగులు అవసరమైన దశలో కార్తీక్‌ 16వ ఓవర్‌లో రెండు ఫోర్లతో బ్యాట్‌కు పనిచెప్పాడు. కానీ మరుసటి ఓవర్‌లోనే పేలవ షాట్‌తో క్యాచ్‌ అవుటయ్యాడు. అప్పటికి ఇంకా 20 పరుగులు కావాల్సి ఉండగా బాబా అపరాజిత్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాట్‌ను ఝుళిపించాడు. 18వ ఓవర్‌లో వరుసగా 6,4 బాది మరో రెండు ఓవర్లుండగానే మ్యాచ్‌ను ముగించాడు.దెబ్బతీసిన సిద్దార్థ్‌.. ఆదుకున్న సోలంకి: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బరోడాకు తొలి ఓవర్‌ నుంచే తమిళనాడు స్పిన్నర్లు చుక్కలు చూపించారు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఎం.సిద్దార్థ్‌ ధాటికి తొలి పది ఓవర్లలోనే ఆరు వికెట్లను కోల్పోయింది. ఇందులో నాలుగు వికెట్లు తనే తీశాడు. కానీ 36/6తో కష్టాల్లో పడిన జట్టును బరోడా స్టార్‌ విష్ణు సోలంకి ఆదుకున్నాడు. రెండో ఓవర్‌లో బరిలోకి దిగిన తను దాదాపు చివరి వరకు అండగా నిలిచాడు. పంజాబ్‌తో సెమీ్‌సలో ఆఖరి బంతిని సిక్సర్‌గా బాది జట్టును గెలిపించిన సోలంకి.. ముందుగా వికెట్‌ను కాపాడుకుంటూ ఆఖర్లో బ్యాట్‌ను ఝుళిపించాడు. అతడికి టెయిలెండర్‌ అతిత్‌ షేథ్‌ (29) జత కలవడంతో ఏడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. క్రీజులో ఉన్నంతసేపు జోరు చూపిన అతిత్‌ 19వ ఓవర్‌లో అవుట్‌ కాగా అటు సోలంకి ధాటిగా ఆడి సిక్సర్లతో చెలరేగాడు. దీంతో 19వ ఓవర్‌లో జట్టు స్కోరు వంద దాటింది. అయితే ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి తను రనౌట్‌ కావడంతో ఒక్క పరుగుతో అర్ధసెంచరీ కోల్పోయాడు. చివరి నాలుగు ఓవర్లలో బరోడా 49 పరుగులు సాధించింది.


సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని ఎక్కువ సార్లు (2) గెలిచిన జట్టుగా బరోడా, కర్ణాటక సరసన తమిళనాడు నిలిచింది.


సంక్షిప్తస్కోర్లు

బరోడా: 20 ఓవర్లలో 120/9 (సోలంకి 49, షేథ్‌ 29; సిద్దార్థ్‌ 4/20)

తమిళనాడు: 18 ఓవర్లలో 123/3 (హరి నిషాంత్‌ 35, బాబా అపరాజిత్‌ 29 నాటౌట్‌, దినేశ్‌ కార్తీక్‌ 22; అతిత్‌ 1/20)

Updated Date - 2021-02-01T06:38:40+05:30 IST