అద్భుతం! క్రికెట్ మ్యాచ్‌లో పక్కపక్కనే ఆఫ్ఘన్, తాలిబన్ జెండాలు

ABN , First Publish Date - 2021-09-04T02:12:08+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత నేడు (శుక్రవారం) తొలిసారిగా జరిగిన క్రికెట్

అద్భుతం! క్రికెట్ మ్యాచ్‌లో పక్కపక్కనే ఆఫ్ఘన్, తాలిబన్ జెండాలు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత నేడు (శుక్రవారం) తొలిసారిగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. ఆఫ్ఘన్ టాప్ క్రికెటర్లు ఆడిన ఈ ట్రయల్ మ్యాచ్‌ను జనం ఎగబడి మరీ చూశారు. అంతేకాదు, తాలిబన్, ఆఫ్ఘన్ జెండాలను పక్క పక్కనే ఉంచి ఊపడం కనిపించింది.


దేశ ఐక్యతకు ఇది నిదర్శనమని క్రికెట్ అధికారులు పేర్కొనడం గమనార్హం. ఆగస్టు 15న దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతారన్న వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడీ మ్యాచ్‌ జరగడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌ను వారు అంగీకరించడం గొప్ప విషయమేనని చెబుతున్నారు. 


పీస్ డిఫెండర్స్, పీస్ హీరోస్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగ్గా, జాతీయ జట్టులోని పలువురు ఆటగాళ్లు పాల్గొన్నారు. యూఏఈ, ఒమన్‌లలో ఈ నెల 17 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సన్నాహకంగా ఈ మ్యాచ్ ఆడారు. కాబూల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు క్యూకట్టారు.


భుజంపై అమెరికన్ ఎం-16 రైఫిల్ మోస్తూ స్టేడియానికి వచ్చిన హమ్జా అనే తాలిబన్ మాట్లాడుతూ.. ఇక్కడ ఉండి ఈ మ్యాచ్‌ను చూడడం గొప్పగా ఉందని పేర్కొన్నాడు. స్టేడియంలో ప్రేక్షకులను అదుపు చేసే బాధ్యత హమ్జాదే. నిజానికి ఆటను చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుల కంటే తాలిబన్లే ఆసక్తిగా మ్యాచ్‌ను గమనించారు.


తాను కూడా క్రికెట్ ఆడతానని, ఆల్‌రౌండర్‌నని హమ్జా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత 1996-2001 నాటి వారి పాలన ప్రపంచం కళ్లముందు కదలాడింది. వారి అరాచకాలు మళ్లీ మొదలవుతాయని భయపడింది. ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తారని భావించారు. వారి మొదటి పాలనా కాలంలో క్రీడలు, వినోదాన్ని పూర్తిగా నిషేధించారు. స్టేడియంలను బహిరంగంగా ఉరితీసేందుకు ఉపయోగించేవారు.  


నేటి మ్యాచ్‌కు దాదాపు 4 వేల మంది ప్రేక్షకులు హాజరు కాగా, వారిలో మహిళలు లేకపోవడం గమనార్హం. మ్యాచ్ జరుగుతున్నంతసేపు వారిలో బోల్డంత ఉత్సాహం కనిపించింది. మరోవైపు, గత 20 ఏళ్లలో ఆప్ఘనిస్థాన్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. బలమైన జట్లలో ఒకటిగా ఎదిగింది.


నేటి మ్యాచ్‌లో అభిమానులు తాలిబన్, ఆఫ్ఘన్ జెండాలను పక్కపక్కనే ఉంచి ఊపుతూ కనిపించారు. మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులను ఉచితంగా స్టేడియంలోకి అనుమతించారు. కాబూల్ పొరుగున తాలిబన్ పోరాట యోధులైన పష్తూన్ల ఆధిపత్యం ఉండే చమన్ ఉజురి సమీపంలోని స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.  


దేశంలో ప్రజా ప్రభుత్వం పడిపోయిన తర్వాత దేశంలో సెక్యూరిటీ పెరిగిందని కాబూల్ వాసులు చెబుతున్నారు. ఐసిస్ ఆత్మాహుతి బాంబు దాడులు జరిగే అవకాశం ఉండడంతో తాలిబన్లు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో పీస్ డిఫెండర్స్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు సీఈవో హమీద్ షిన్వరి తెలిపారు.


తాలిబన్, ఆఫ్ఘన్ జెండాలను ఊపడం ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. తాలిబన్లతో చర్చలు జరిపామని, క్రికెట్‌కు మంచి భవిష్యత్ ఉన్నట్టు వారు సంకేతాలు ఇచ్చారని తెలిపారు. కాగా, ఆఫ్ఘన్ మహిళా జట్టు క్రికెటర్లలో కొందరు ఇప్పటికే దేశం విడిచినట్టు వార్తలు వచ్చాయి.  

Updated Date - 2021-09-04T02:12:08+05:30 IST