బట్లర్‌ సూపర్‌ సెంచరీ

ABN , First Publish Date - 2021-11-02T08:41:36+05:30 IST

టీ20 వరల్డ్‌క్‌పలో వరుస విజయాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్‌ సెమీ్‌సకు మరింత చేరువైంది.

బట్లర్‌ సూపర్‌ సెంచరీ

ఇంగ్లండ్‌కు సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయం

లంక ఇంటికే!


షార్జా: టీ20 వరల్డ్‌క్‌పలో వరుస విజయాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్‌ సెమీ్‌సకు మరింత చేరువైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 నాటౌట్‌) సుడిగాలి శతకంతో.. గ్రూప్‌-1లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 26 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఇంగ్లండ్‌ మొత్తం 8 పాయింట్లు సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 163/4 పరుగులు చేసింది. కెప్టెన్‌ మోర్గాన్‌ (40) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. హసరంగ (3/21) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో లంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. హసరంగ (34), కెప్టెన్‌ షనక (26), రాజపక్స (26) పోరాడారు. రషీద్‌, జోర్డాన్‌, మొయిన్‌ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 


ఆశలు రేపిన షనక, హసరంగ:

చేధన ఆరంభంలోనే లంకకు గట్టిదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ నిస్సాంక (1) రనౌట్‌ అయ్యాడు. అయితే, ఫామ్‌లో ఉన్న అసలంక (21), మరో ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (7) ఆదుకొనే ప్రయత్నం చేశారు. మూడు ఫోర్లు, సిక్స్‌తో ధాటిగా ఆడుతున్న అసలంక, పెరీరాను రషీద్‌ పెవిలియన్‌ చేర్చడంతో లంక క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొంది. ఫెర్నాండో (13)ను జోర్డాన్‌ ఎల్బీ చేయగా.. ధాటిగా ఆడుతున్న రాజపక్సను వోక్స్‌ క్యాచవుట్‌ చేయడంతో లంక 76/5తో నిలిచింది. ఈ దశలో షనక, హసరంగ ఆరో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపారు. అయితే, లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్‌తో హసరంగ పెవిలియన్‌ చేరాడు. బౌండ్రీ రోప్‌ వద్ద క్యాచ్‌ను అందుకొన్న రాయ్‌.. అదుపుతప్పుతున్న సమయంలో బంతిని పైకి విసరడంతో.. బిల్లింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. వెంటవెంటనే షనక, చమీర (4) అవుట్‌ కావడంతో మ్యాచ్‌ ఇంగ్లండ్‌ చేతుల్లోకి వెళ్లింది. చివరి 12 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉండగా.. కరుణరత్నె (0), తీక్షణ (2)ను అవుట్‌ చేసి మొయిన్‌ లంక ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 


ఆరంభంలో తడబడినా..:

లంక స్పిన్నర్లు చెలరేగడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఆరంభంలో పరుగుల కోసం ఆపసోపాలు పడింది. కానీ, ఓపెనర్‌ బట్లర్‌, కెప్టెన్‌ మోర్గాన్‌ నాలుగో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యంతో పోరాడగలిగే స్కోరు చేసింది. బట్లర్‌ ఊచకోతతో చివరి 10 ఓవర్లలో 116 పరుగులు స్కోరు చేసింది. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (9)ను బౌల్డ్‌ చేసిన హసరంగ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మలన్‌ (6)ను చమీర పెవిలియన్‌ చేర్చగా.. బెయిర్‌స్టో (0)ను హసరంగ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఇంగ్లండ్‌ 35/3లో నిలిచింది. ఈ దశలో కెప్టెన్‌ మోర్గాన్‌ అండతో బట్లర్‌ స్కోరును నడిపించాడు. 18వ ఓవర్‌లో షనక బౌలింగ్‌లో జూలు విదిల్చిన బట్లర్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 19 పరుగులు పిండుకున్నాడు. అయితే, హసరంగ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన మోర్గాన్‌.. ఆ తర్వాతి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. కానీ, తుదికంటా నిలిచిన బట్లర్‌.. సిక్స్‌తో టీ20ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

Updated Date - 2021-11-02T08:41:36+05:30 IST