ప్రాక్టీస్‌ అదిరింది

ABN , First Publish Date - 2021-10-19T07:59:21+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాలను భారత్‌ మెరుగ్గా ఆరంభించింది. సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వామప్‌ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్రాక్టీస్‌ అదిరింది

ఇషాన్‌, రాహుల్‌ హాఫ్‌ సెంచరీలు 

ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాలను భారత్‌ మెరుగ్గా ఆరంభించింది. సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వామప్‌ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు విశ్రాంతినివ్వగా ఓపెనర్లు ఇషాన్‌ (46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 రిటైర్డ్‌), రాహుల్‌ (24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) తమ ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించారు. బౌలింగ్‌లో మాత్రం భువీ, రాహుల్‌ చాహర్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెయిర్‌స్టో (49), మొయిన్‌ అలీ (43) రాణించారు. షమికి మూడు వికెట్లు దక్కాయు. ఆ తర్వాత భారత్‌ 19 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి నెగ్గింది. రిషభ్‌ పంత్‌ (29 నాటౌట్‌) ఆఖరిదాకా నిలిచాడు. 


ఓపెనర్ల జోరు:

భారీ ఛేదనను భారత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆరంభించింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు రాహుల్‌, ఇషాన్‌ పోటాపోటీగా ఆడడంతో జట్టు 59 పరుగులు సాధించింది. వోక్స్‌ ఓవర్‌లో రాహుల్‌ 4,4,6,4తో 18 రన్స్‌ రాబట్టగా ఆ తర్వాత ఇషాన్‌ 4,6,4తో చెలరేగి 16 రన్స్‌ సాధించాడు. ఈ జోరుతో 23 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన రాహుల్‌ను 9వ ఓవర్‌లో ఉడ్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ఆట నెమ్మదించినా 12వ ఓవర్‌లో ఇషాన్‌ 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాది 24 రన్స్‌తో కావాల్సిన రన్‌రేట్‌ను అమాంతం తగ్గించాడు. 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఇషాన్‌ 70 పరుగుల వద్ద రిటైర్డ్‌ అయ్యాడు. కోహ్లీ (11), సూర్యకుమార్‌ (8) నిరాశపరిచారు. అయితే ఆఖర్లో పంత్‌, హార్దిక్‌ పాండ్యా (12 నాటౌట్‌) జోడీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్‌కు విజయాన్ని ఖాయం చేసింది.


బెయిర్‌స్టో అండగా..:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి పది ఓవర్లలో కాస్త తడబడినట్టు కనిపించింది. 77 పరుగులకే ఓపెనర్లు బట్లర్‌ (18), రాయ్‌ (17), మలాన్‌ (18)   వెనుదిరిగారు. ఈ దశలో లివింగ్‌స్టోన్‌ (30)తో కలిసి బెయిర్‌స్టో నాలుగో వికెట్‌కు 52 పరుగులు జత చేశాడు. ముఖ్యంగా లివింగ్‌స్టోన్‌ స్పిన్నర్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 14వ ఓవర్‌లో 6,4,4 బాదడంతో స్కోరులో వేగం పెరిగింది. తర్వాతి ఓవర్‌లోనే లివింగ్‌స్టోన్‌ను షమి అద్భుత బంతితో బౌల్డ్‌ చేశాడు. అటు బెయిర్‌స్టో కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో రన్స్‌ ధారాళంగానే వచ్చాయి. అయితే హాఫ్‌ సెంచరీకి పరుగు దూరంలో అతడిని బుమ్రా అవుట్‌ చేశాడు. కానీ చివరి ఓవర్‌లో మొయిన్‌ అలీ వరుసగా 4,6,6తో మొత్తం 21 పరుగులు రాబట్టడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు నమోదు చేసింది.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌:


రాయ్‌ (సి) బుమ్రా (బి) షమి 17; బట్లర్‌ (బి) షమి 18; మలాన్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 18; బెయిర్‌స్టో (బి) బుమ్రా 49; లివింగ్‌స్టోన్‌ (బి) షమి 30; మొయిన్‌ అలీ (నాటౌట్‌) 43; వోక్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 188/5. వికెట్ల పతనం: 1-36, 2-47, 3-77, 4-129, 5-163. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-54-0; బుమ్రా 4-0-26-1; షమి 4-0-40-3; అశ్విన్‌ 4-0-23-0; రాహుల్‌ చాహర్‌ 4-0-43-1.

భారత్‌:

రాహుల్‌ (సి) మొయున్‌ అలీ (బి) ఉడ్‌ 51; ఇషాన్‌ (రిటైర్డ్‌ నాటౌట్‌) 70; కోహ్లీ (సి) రషీద్‌ (బి) లివింగ్‌ స్టోన్‌ 11; పంత్‌ (నాటౌట్‌) 29; సూర్యకుమార్‌ (సి) బట్లర్‌ (బి) విల్లే 8; హార్దిక్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 19 ఓవర్లలో 192/3. వికెట్ల పతనం: 1-82, 2-125, 3-168. బౌలింగ్‌: విల్లే 3-0-16-1; వోక్స్‌ 4-0-40-0; ఉడ్‌ 2-0-22-1; జోర్డాన్‌ 3-0-35-0; మొయిన్‌ అలీ 2-0-28-0; రషీద్‌ 3-0-36-0; లివింగ్‌స్టోన్‌ 2-0-10-1.

Updated Date - 2021-10-19T07:59:21+05:30 IST