విజయం ఊరిస్తోంది..
ABN , First Publish Date - 2021-12-30T07:56:38+05:30 IST
టీమిండియాను విజయం ఊరిస్తోంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతున్న టెస్ట్‌లో తడిబడినా.. మొత్తంగా 305 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని భారత్..

గెలుపు దిశగా భారత్
సఫారీల లక్ష్యం 305
ప్రస్తుతం 94/4
టీమిండియాను విజయం ఊరిస్తోంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతున్న టెస్ట్‌లో తడిబడినా.. మొత్తంగా 305 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని భారత్.. సఫారీల ముందుంచింది. రెండో ఇన్నింగ్స్‌లో 94/4 స్కోరు చేసిన సౌతాఫ్రికా.. విజయానికి 211 పరుగుల దూరంలో ఉండగా.. సిరీస్‌లో బోణీ కొట్టడానికి భారత్‌కు ఇంకా 6 వికెట్లు కావాలి.
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. టీమిండియా నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. బుధవారం ఆటముగిసే సమయానికి కెప్టెన్ ఎల్గర్ (52) అర్ధ శతకంతో క్రీజులో ఉండగా.. నాలుగో రోజు ఆట చివరి బంతికి నైట్ వాచ్‌మన్ కేశవ్ మహరాజ్ (8)ను బుమ్రా బౌల్ట్ చేశాడు. ఆఖరి రోజు సౌతాఫ్రికా విజయానికి ఇంకా 211 పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో మరో 6 వికెట్లున్నాయి. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. షమి, సిరాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు 16/1తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 174 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (34) టాప్ స్కోరర్. పేసర్లు రబాడ, జాన్సెన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లీడ్ 130 పరుగులు కలిపి టీమిండియా మొత్తం 304 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. ఈపిచ్‌పై ఇంతటి స్కోరును గతంలో ఏ జట్లూ ఛేదించలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 197 పరుగులకు కుప్పకూలింది.
కోహ్లీ విఫలం..: అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై రబాడ, జాన్సెన్ నిప్పులు చెరగడంతో.. టీమిండియా బ్యాటింగ్ తడబడింది. తొలి సెషన్ ఆరంభంలోనే శార్దూల్ (10), ఓపెనర్ రాహుల్ (23)ను రబాడ అవుట్ చేశాడు. కానీ, పుజార (16), కోహ్లీ (18) జాగ్రత్తగా ఆడడంతో భారత్ 79/3తో లంచ్‌కు వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత జాన్సెన్ వేసిన తొలి బంతికే కోహ్లీ.. డ్రైవ్ చేసే క్రమంలో కీపర్‌కు క్యాచిచ్చాడు. ఈ దశలో వెటరన్లు పుజార, రహానె (20) ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఎదురుదాడికి దిగిన రహానె.. జాన్సెన్ బౌలింగ్‌లో 4,6,4తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. ఐదో వికెట్‌కు 30 పరుగులతో వీరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో.. పుజారను ఎన్గిడి పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రహానెను జాన్సెన్ వెనక్కిపంపాడు. ధాటిగా ఆడే ప్రయ త్నం చేసిన పంత్‌తోపాటు అశ్విన్ (14), షమి (1)లను తన వరుస ఓవర్లలో అవుట్ చేసిన రబాడ భారత్ భారీస్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. సిరాజ్‌ను బౌల్డ్ చేసిన జాన్సెన్.. టీ బ్రేక్‌కు ముందే భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
షమి షాక్..: భారీ లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు షమి ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ మార్క్రమ్ (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ, మరో ఓపెనర్ ఎల్గర్, పీటర్సన్ (17) ఆచితూచి ఆడడంతో సౌతాఫ్రికా 22/1తో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆఖరి సెషన్ మొదలైన కొద్దిసేపటికే పీటర్సన్‌ను క్యాచ్ అవుట్ చేసిన సిరాజ్.. రెండో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఈ దశలో ఎల్గర్‌కు జతకలసిన డుస్సెన్ (11) జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే, డుస్సెన్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా.. మూడో వికెట్‌కు 40 రన్స్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. మరోవైపు ఎల్గర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సెంచూరియన్ గ్రౌండ్లో అత్యధికంగా 334 బంతులు ఎదుర్కొన్న తొలి విదేశీ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్. ఈ వేదికపై ఎక్కువ బంతులు ఆడిన పర్యాటక జట్టు ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌కు చెందిన షాన్ మార్ష్ (372) అత్యధిక బంతులు ఎదుర్కొన్నాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 327 ఆలౌట్.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 197 ఆలౌట్.
భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) ఎల్గర్ (బి) ఎన్గిడి 23, మయాంక్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 4, శార్దూల్ (సి) ముల్డర్ (బి) రబాడ 10, పుజార (సి) డికాక్ (బి) ఎన్గిడి 16, కోహ్లీ (సి) డికాక్ (బి) జాన్సెన్ 18, రహానె (సి) డుస్సెన్ (బి) జాన్సెన్ 20, రిషభ్ పంత్ (సి) ఎన్గిడి (బి) రబాడ 34, అశ్విన్ (సి) పీటర్సన్ (బి) రబాడ 14, షమి (సి) ముల్డర్ (బి) రబాడ 1, బుమ్రా (నాటౌట్) 7, సిరాజ్ (బి) జాన్సెన్ 0; ఎక్స్‌ట్రాలు: 27; మొత్తం: 50.3 ఓవర్లలో 174 ఆలౌట్; వికెట్ల పతనం: 1-12, 2-34, 3-54, 4-79, 5-109, 6-111, 7-146, 8-166, 9-169; బౌలింగ్: రబాడ 17-4-42-4, ఎన్గిడి 10-2-31-2, జాన్సెన్ 13.3-4-55-4, ముల్డర్ 10-4-25-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) షమి 1, డీన్ ఎల్గర్ (బ్యాటింగ్) 52, పీటర్సన్ (సి) పంత్ (బి) సిరాజ్ 17, డుస్సెన్ (బి) బుమ్రా 11, కేశవ్ మహరాజ్ (బి) బుమ్రా 8; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 40.5 ఓవర్లలో 94/4; వికెట్ల పతనం: 1-1, 2-34, 3-74, 4-94; బౌలింగ్: బుమ్రా 11.5-2-22-2, షమి 9-2-29-1, సిరాజ్ 11-4-25-1, శార్దూల్ 5-0-11-0, అశ్విన్ 4-1-6-0.