ఒలింపిక్స్‌కు అవకాశం లేనట్టేనా!
ABN , First Publish Date - 2021-05-08T09:08:50+05:30 IST
స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌కు టోక్యో ఒలింపిక్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి.

సైనా, శ్రీకాంత్‌కు ఎదురుదెబ్బ
మలేసియా ఓపెన్ వాయిదా
న్యూఢిల్లీ: స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌కు టోక్యో ఒలింపిక్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి. విశ్వక్రీడల అర్హతకు మిగిలిన రెండు టోర్నీలలో ఒకటైన మలేసియా ఓపెన్ కరోనాతో వాయిదాపడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఈనెల 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సిన ఈ సూపర్ 750 టోర్నీని మలేసియాలో కొవిడ్ విజృంభిస్తుండడంతో వాయిదా వేసినట్టు బీడబ్ల్యూఎఫ్ వివరించింది. ఇక జూన్ ఒకటి నుంచి జరగాల్సిన సింగపూర్ ఓపెన్ ఒక్కటే మిగిలింది. కానీ భారత్‌లో కరోనా విలయం సృష్టిస్తుండడంతో మనదేశం నుంచి సింగపూర్‌కు విమానాలను ఆ ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో సైనా, శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్‌లో పాల్గొనడం అనుమానమే. అయితే భారత్ కాకుండా వేరే దేశంలో 14 రోజులు క్వారంటైన్లో ఉండి వారిద్దరు సింగపూర్ చేరుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న.