టెస్టులకు డికాక్‌ వీడ్కోలు

ABN , First Publish Date - 2021-12-31T09:26:10+05:30 IST

టెస్టులకు డికాక్‌ వీడ్కోలు

టెస్టులకు డికాక్‌ వీడ్కోలు

పరిమిత ఓవర్లలో కొనసాగుతా!


సెంచూరియన్‌: నూతన సంవత్సర వేళ దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న అతడు టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే పరిమిత ఓవర్లలో కొనసాగుతానని తెలిపాడు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పాడు. గురువారం భారత్‌తో ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతను 34, 21 పరుగులు మాత్రమే చేసి శార్దూల్‌, సిరాజ్‌ చేతిలో బౌల్డయ్యాడు. వాస్తవానికి తన భార్య డెలివరీ కారణంగా రెండో టెస్టుకు అందుబాటులో ఉండనని గతంలోనే ప్రకటించాడు. కానీ ఇంతలోనే మనసు మార్చుకుని ఏకంగా సుదీర్ఘ ఫార్మాట్‌కే గుడ్‌బై చెప్పడం క్రీడా వర్గాలను విస్మయపరిచినట్టయింది. ‘ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించబోతున్నాం. దీంతో జీవితంలో దేనికి ప్రాధాన్యమివ్వాలని ఆలోచించేందుకు చాలా సమయమే తీసుకున్నాను’ అన్నాడు.

Updated Date - 2021-12-31T09:26:10+05:30 IST