కుర్ర కారు.. ప్రేమ జోరు!
ABN , First Publish Date - 2021-01-27T07:01:07+05:30 IST
దూకుడైన ఆటతో ప్రత్యర్థుల్లో గుబులు పుట్టించే మన కుర్ర బ్యాట్స్‌మెన్ గుండెల్లో అలజడి మొదలైంది. బ్యాటుతో ఫోర్లు, సిక్సర్ల జోరు కురిపించే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్.. ప్రేమ వర్షంలో మునిగి...
దూకుడైన ఆటతో ప్రత్యర్థుల్లో గుబులు పుట్టించే మన కుర్ర బ్యాట్స్‌మెన్ గుండెల్లో అలజడి మొదలైంది. బ్యాటుతో ఫోర్లు, సిక్సర్ల జోరు కురిపించే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్.. ప్రేమ వర్షంలో మునిగి తేలుతున్నారు. ‘నీ కాళ్లని పట్టుకుని వదలనన్నది’ అని పాడుకుంటూ మరో లోకంలో విహరిస్తున్నారు.
రిషభ్ పంత్-ఇషా నేగి
ఇంటీరియర్ డిజైనర్ ఇషా నేగితో మంచుకొండల్లో దిగిన ఫొటోలను న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసిన పంత్..‘నీతో ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడతా’ అని రాయడం ద్వారా ఆమెతో తన ప్రేమను బహిరంగపరిచాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో పంత్ హీరోచిత ఇన్నింగ్స్‌తో ప్రస్తుతం నెటిజన్ల దృష్టి పంత్-నేగిపై జోడీపై మరింత పడింది.
సారా టెండూల్కర్ -శుభ్‌మన్ గిల్
బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుకు కళాత్మకత జోడించి 91 పరుగులు చేసిన పంజాబ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్లో ఉన్నాడన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. గత ఐపీఎల్లో కోల్‌కతా ఆటగాడైన గిల్ ఫీల్డింగ్ విన్యాసాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి దానికో లవ్ సింబల్‌ను కూడా సారా ఇవ్వడంతో వారి డేటింగ్ వార్తకు బలం చేకూర్చింది.
ఇషాన్ కిషన్ - అదితి హుండియా
నిరుడు ఐపీఎల్‌ఎలో ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ కిషన్ ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వాటిలో కొన్ని ఫొటోలను ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్, మిస్ యూనివర్స్ ఇండియా ఫస్ట్ రన్నరప్ అదితి హుండియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందన్న వార్తలు బయలుదేరాయి.
పృథ్వీ షా-ప్రాచీ సింగ్
టీవీ నటి ప్రాచీ సింగ్‌తో ముంబై యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా ప్రేమాయణం ఇప్పుడు హాట్ టాపిక్. ప్రాచీని ‘స్వీటీ’ అని ముద్దుగా పిలుస్తూ ఆమెతో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేస్తూ.. వాటికి కొంటె కామెంట్లు జోడిస్తుంటాడు షా. దీంతో వీళ్ల మధ్య ఏదో ఉందన్న విషయాన్ని నెటిజన్లు గ్రహించేశారు.
కేఎల్ రాహుల్-అతియా శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియాతో స్టయిలిష్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ చెట్టపట్టాల్ అందరికీ తెలిసిందే. తమ కుమార్తె లవ్‌కు సునీల్ శెట్టి దంపతులు కూడా ఓకే చెప్పారట.