తొలి అడుగు ఘనంగా..

ABN , First Publish Date - 2021-12-31T09:19:53+05:30 IST

తొలి అడుగు ఘనంగా..

తొలి అడుగు ఘనంగా..

టెస్టు సిరీస్ లో భారత్‌ బోణీ జూ చెలరేగిన పేసర్లు

దక్షిణాఫ్రికాపై 113 రన్స్‌ తేడాతో భారీవిజయం



సఫారీ నేలపై దశాబ్దాలుగా ఊరిస్తున్న టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ఆరంభం అదిరింది. మొదటి రోజు నుంచే స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లిన కోహ్లీ సేన ఎక్కడా పట్టు తప్పలేదు. పేస్‌ త్రయం బుమ్రా, షమి, సిరాజ్‌ అద్భుత బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. దీంతో 305 పరుగుల భారీ ఛేదనను ప్రొటీస్‌ ఏ దశలోనూ ఛేదించేలా కనిపించలేదు. తద్వారా సెంచూరియన్‌లో తొలి విజయంతో పాటు విదేశాల్లో ఈ ఏడాది తమ జైత్రయాత్రకు భారత జట్టు అద్భుత ముగింపు పలికినట్టయింది.


సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీ్‌సలో భారత జట్టు శుభారంభం చేసింది. గురువారం ముగిసిన ఈ తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడంతో పాటు.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. వచ్చే నెల 3 నుంచి జొహాన్నె్‌సబర్గ్‌లో రెండో టెస్టు ఆరంభమవుతుంది. రెండో రోజు వర్షంతో ఆట పూర్తిగా రద్దయినప్పటికీ.. భారత బౌలర్ల సంపూర్ణ ఆధిపత్యంతో ఈ మ్యాచ్‌ను వశం చేసుకోగలిగింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన 20 వికెట్లలో పేసర్లే 18 వికెట్లు తీయడం విశేషం. అలాగే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దక్షిణాఫ్రికా 200 రన్స్‌ లోపే ఆలౌట్‌ కావడం గమనార్హం. దీంతో ఇప్పటిదాకా తమకు తిరుగులేదని భావించిన సెంచూరియన్‌లో సఫారీలకు గట్టి ఝలక్‌ తగిలినట్టయింది. 305 రన్స్‌ ఛేదనలో గురువారం ఆతిథ్య జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు బుమ్రా, షమి మూడేసి వికెట్లతో ప్రత్యర్థిని వణికించారు. కెప్టెన్‌ ఎల్గర్‌ (77), బవుమా (35 నాటౌట్‌) మాత్రమే రాణించారు. సిరాజ్‌, అశ్విన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. 


పోరాటమే లేదు..: బుధవారం నాలుగో రోజు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 94/4 స్కోరుతో దయనీయంగా కనిపించింది. అయితే చేతిలో ఆరు వికెట్లు ఉండడంతో ఐదో రోజున కనీస ప్రతిఘటన ఉంటుందేమోనని భావించారు. కానీ బంతి అనూ హ్యంగా బౌన్స్‌ కావడంతో పాటు భారత పేసర్ల సమష్టి దాడికి దాదాపుగా ఓ సెషన్‌లోనే చేతులెత్తేశారు. కెప్టెన్‌ ఎల్గర్‌ ఒక్కడే ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్‌లో బవుమా ఆఖరి వరకు నిలిచినా సహకారం లేకపోవడంతో 97 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. అంతకుముందు ఎల్గర్‌-బవుమా జోడీ ఐదో వికెట్‌కు 36 పరుగులు జతచేసింది. ఓపిగ్గా ఆడుతున్న ఎల్గర్‌ రిటర్న్‌ క్యాచ్‌ను షమి వదిలేసినా.. బుమ్రా భారత్‌కు రిలీ్‌ఫనిచ్చాడు. 51వ ఓవర్‌లో అతడిని ఎల్బీగా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత డికాక్‌ (21) వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అతడిని ఎక్కువసేపు క్రీజులో ఉండనీయకుండా సిరాజ్‌ సూపర్‌ బాల్‌తో బౌల్డ్‌ చేయగా తర్వాతి ఓవర్‌లోనే ముల్డర్‌ (1)ను షమి అవుట్‌ చేశాడు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయానికి 182/7 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. ఇక రెండో సెషన్‌ ఆరంభ ఓవర్‌లోనే షమి ఓ వికెట్‌.. మరుసటి ఓవర్‌లో అశ్విన్‌ రెండు వికెట్లు తీయడంతో సఫారీల ఓటమి పరిపూర్ణమైంది.


గాబాలో బ్రేక్‌ఫాస్ట్‌...

విదేశాల్లో భారత జట్టు తేలిపోతుందనే విమర్శలను ఈ ఏడాది కోహ్లీ సేన అద్భుతంగా తిప్పికొట్టగలిగింది. 2021 ఆరంభంలో బ్రిస్బేన్‌, ఆ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో లార్డ్ప్‌లో, తాజాగా సెంచూరియన్‌ కోటను బద్దలుకొట్టడంతో ఏడాదిని ఘనంగా ముగించింది. ఈ మైదానంలో గెలిచిన తొలి ఆసియా జట్టుగానూ రికార్డులకెక్కింది. అంతేకాకుండా దక్షిణాఫ్రికాలో రెండు టెస్టు విజయాలు అందుకున్న ఏకైక భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. అందుకే ఈ విజయాలపై మాజీలతో పాటు అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘గాబాలో బ్రేక్‌ఫాస్ట్‌.. లార్డ్స్‌లో లంచ్‌.. సెంచూరియన్‌లో డిన్నర్‌’ అంటూ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ‘ప్రపంచంలో ఏ మైదానంలోనైనా 20 వికెట్లు తీయగల అద్భుత బౌలింగ్‌ మన సొంతం. టీమిండియాకు శుభాకాంక్షలు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. సెంచూరియన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచినందుకు కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ ద్రవిడ్‌లకు మాజీ కోచ్‌ రవిశాస్త్రి, వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభినందనలు తెలిపారు.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 327

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 197

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 174

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (బి) షమి 1; డీన్‌ ఎల్గర్‌ (ఎల్బీ) బుమ్రా 77; పీటర్సన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 17; డుస్సెన్‌ (బి) బుమ్రా 11, కేశవ్‌ మహరాజ్‌ (బి) బుమ్రా 8; బవుమా (నాటౌట్‌) 35; డికాక్‌ (బి) సిరాజ్‌ 21; ముల్డర్‌ (సి) పంత్‌ (బి) షమి 1; జాన్సెన్‌ (సి) పంత్‌ (బి) షమి 13; రబాడ (సి) షమి (బి) అశ్విన్‌ 0; ఎన్‌గిడి (సి) పుజార (బి) అశ్విన్‌ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 68 ఓవర్లలో 191 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-1, 2-34, 3-74, 4-94; 5-130, 6-161, 7-164, 8-190, 9-191, 10-191.  బౌలింగ్‌: బుమ్రా 19-4-50-3; షమి 17-3-63-3; సిరాజ్‌ 18-5-47-2; శార్దూల్‌ 5-0-11-0; అశ్విన్‌ 9-2-18-2.  


సెంచూరియన్‌ మైదానంలో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా భారత్‌. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌, ఆసీస్‌ తర్వాత మూడో టీమ్‌గా నిలిచింది. అలాగే ఇక్కడ ఆడిన 28 టెస్టుల్లో సఫారీ జట్టు మూడు సార్లే ఓడింది.


విదేశాల్లో భారత్‌ తరఫున టెస్టుల్లో (23) వేగంగా 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌ బుమ్రా. 


మూడు బాక్సింగ్‌ డే టెస్టుల్లో (2018, 2020 మెల్‌బోర్న్‌.. 2021 సెంచూరియన్‌) విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ. అంతేకాకుండా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆసీస్‌, కివీ్‌సలలో అత్యధిక విజయాలు (7) సాధించిన ఏకైక ఆసియా జట్టు కెప్టెన్‌గానూ నిలిచాడు.


ఈ ఏడాది విదేశాల్లో ఎక్కువ (4) విజయాలు సాధించిన రెండో జట్టుగా భారత్‌. పాక్‌ (5) ముందుంది. అలాగే ఆసియా ఆవల ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో  2018 తర్వాత భారత జట్టు నాలుగు సార్లు గెలవగలిగింది.


దక్షిణాఫ్రికాలో ఆడిన 22 టెస్టుల్లో భారత జట్టుకిది నాలుగో విజయం.

Updated Date - 2021-12-31T09:19:53+05:30 IST