అతిగా ఊహించుకోవద్దు

ABN , First Publish Date - 2021-11-23T09:00:25+05:30 IST

అతిగా ఊహించుకోవద్దు

అతిగా ఊహించుకోవద్దు

కోల్‌కతా: న్యూజిలాండ్‌పై 3-0 తేడాతో భారత జట్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్  చేయడం సంతోషంగా ఉందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు. అయితే ఈ విజయంపై అతిగా ఊహించుకోనవసరం లేదని గుర్తుచేశాడు. ‘ఈ సిరీ్‌సలో జట్టులోని ప్రతీ ఒక్కరూ మెరుగ్గా ఆడారు. ఆరంభంలోనే ఇలాంటి విజయం లభించడం సంతోషకరమే. ప్రత్యర్థి కివీస్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆడాక.. ఆరు రోజుల వ్యవధిలోనే మరో 3 మ్యాచ్‌ల్లో తలపడింది. ఇదంత సులువేమీ కాదు. అయితే మనకు తగినంత విశ్రాంతి లభించడం ఉపకరించింద’ని ద్రవిడ్‌ చెప్పాడు.


వెంకటేశ్‌ బౌలింగ్‌ కీలకం: రోహిత్‌

రానున్న రోజుల్లో ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ జట్టుకు కీలకంగా మారనున్నాడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అతడు కివీ్‌సతో టీ20 సిరీ్‌సకు ఎంపికైన విషయం తెలిసిందే. తొలిసారిగా తను భారత్‌ తరఫున మూడో టీ20లో బౌలింగ్‌ చేసి వికెట్‌ కూడా తీశాడు. ‘ఐపీఎల్‌లో అతడు టాపార్డర్‌లో ఆడాడు. కానీ భారత్‌ తరఫున ఐదు, ఆరు లేక ఏడో స్థానంలో కూడా ఆడాల్సి రావచ్చు. ఇది అయ్యర్‌ కెరీర్‌ ఆరంభం మాత్రమే. వాస్తవానికి తన సత్తా ప్రదర్శించేందుకు ఇంకా తగిన అవకాశం రాలేదనే చెప్పవచ్చు. కానీ మున్ముందు మేం అతడిపై కచ్చితంగా దృష్టిసారిస్తాం’ అని రోహిత్‌ తెలిపాడు. మరోవైపు అశ్విన్‌లాంటి బౌలర్‌ జట్టులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాడు. పొట్టి ఫార్మాట్‌తో అతడి పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడని, మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడని అభినందించాడు. టెస్టుల మాదిరిగానే పరిమిత ఓవర్లలోనూ అశ్విన్‌కు మెరుగైన రికార్డే ఉందని గుర్తుచేశాడు.


కొత్త కెప్టెన్‌ రోహిత్‌.. కొత్త కోచ్‌ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో భారత టీ20 జట్టు తమ తొలి ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించింది. సిరీ్‌సలోని మూడు మ్యాచ్‌లనూ గెలుచుకుని అదరగొట్టింది. టీ20 వరల్డ్‌క్‌పలో పేలవ ప్రదర్శన అనంతరం అభిమానులకు ఈ క్లీన్‌స్వీ్‌ప కాస్త ఉపశమనం కలిగించి ఉండవ చ్చు. కానీ యూఏఈలో వైఫల్యం అంత సులువుగా మర్చిపోలేకున్నా.. జట్టు మరో కప్‌ కోసం ఇప్పుడిప్పుడే పునర్‌నిర్మాణంలో ఉందనే విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి టీ20 లకే పరిమితమైన రోహిత్‌-ద్రవిడ్‌ కాంబినేషన్‌ అదుర్స్‌ అనిపించుకుంది. అలాగే ఈ సిరీస్‌ కోసం చేసిన మార్పులు కూడా చక్కటి ఫలితాన్నిచ్చాయి. ఇక ఈడెన్‌లో ముందుగా బ్యాటింగ్‌ తీసుకుని కఠిన సవాల్‌కు ఎదురునిలవడం కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను సంతృప్తి పరిచింది. మంచు పరిస్థితిలో ముందుగా బ్యాటింగ్‌కు దిగడం కష్టమని తెలిసీ తమ సత్తాను పరీక్షించుకోవాలనుకుంది. అయితే మిడిలార్డర్‌ విఫలమైనా ఓపెనర్లు, టెయిలెండర్లు ఆకట్టుకోవడంతోనే ఈడెన్‌లో భారీ స్కోరు సాధ్యమైంది.  నిజానికి స్వదేశంలో సిరీ్‌సలు గెలవడం భారత్‌కు పెద్ద విషయం కాదు. కానీ ఈ సిరీస్‌ అన్నింటిలా కాదు. చాలా విషయాల్లోనూ జట్టును కింది నుంచి నిర్మించే ప్రక్రియలో దీన్ని ఆరంభంగా చెప్పవచ్చు. మరోవైపు స్టార్‌ ప్లేయర్స్‌ కోహ్లీ, బుమ్రా, జడేజా, షమి ఈ సిరీ్‌సకు దూరంగా ఉన్నారు. వీరంతా జట్టులోకి వస్తే ప్రస్తుతం ఆకట్టుకున్న యువ ఆటగాళ్లను ఎలా భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా ఉండనుంది.

Updated Date - 2021-11-23T09:00:25+05:30 IST