స్పిన్‌ ద్వయం..బ్యాటింగ్‌ అమోఘం

ABN , First Publish Date - 2021-02-09T04:03:37+05:30 IST

స్పిన్‌ ద్వయం..బ్యాటింగ్‌ అమోఘం

స్పిన్‌ ద్వయం..బ్యాటింగ్‌ అమోఘం

  • తమిళ తంబీల కీలక భాగస్వామ్యం

(ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్‌ డెస్క్‌)

హేమాహేమీలైన బ్యాట్స్‌మెన్‌ ఇంగ్లండ్‌ స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌కు చేతులెత్తేసిన వేళ  తొలి టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో లోకల్‌ హీరోలు వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ అదరహో అనిపించారు..లెక్కకు మిక్కిలి టెస్ట్‌లు, వేలాదిగా పరుగులు చేసిన జట్టులోని ప్రముఖ బ్యాట్స్‌మెన్‌ అనూహ్యంగా దూసుకొచ్చిన బంతులను ఆడడంలో తత్తరపడిన సమయాన సుందర్‌, అశ్విన్‌ వాటిని తెలివిగా ఎదుర్కొన్నారు..తద్వారా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు పాఠం నేర్పారు..ఏడో వికెట్‌కు తమిళ తంబీలు 80 పరుగులు జోడించి టీమిండియాకు ఆపద్బాంధవులయ్యారు..వాషింగ్టన్‌ సుందర్‌..21 ఏళ్ల ఈ చెన్నై యువకుడు భారత జట్టు నయా సంచలనం. ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అమోఘమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్‌ టెస్ట్‌లో భారత్‌ సాధించిన చారిత్రక విజయంలో సుందర్‌ పాత్ర చిరస్మరణీయం. ఆ టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ మేటి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొని 62 రన్స్‌ చేసిన సుందర్‌..అప్పుడు శార్దూల్‌ ఠాకూర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా జట్టు విజయానికి బాటలు వేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో చెన్నై టెస్ట్‌లోనూ క్లిష్ట పరిస్థితుల్లో తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. తన రాష్ట్రానికే చెందిన సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (31)తో కలిసి విలువైన భాగస్వామ్యంతో జట్టును కష్టాలనుంచి గట్టెక్కించాడు. 


పాఠం నేర్పేలా..

టాపార్డర్‌ విఫలమైన పిచ్‌పై ఎలా ఆడాలో సుందర్‌తోపాటు అశ్విన్‌ చూపించారు. ఇటీవల బ్యాటింగ్‌లో విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న అశ్విన్‌ కీలక తరుణంలో మళ్లీ ఫామ్‌లోకొచ్చాడు. 91 బంతులపాటు ప్రత్యర్థి బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. మరోవైపు ఆదివారం పుజార అవుటైన (192/5) తర్వాత క్రీజులోకి వచ్చిన సుందర్‌ (85 నాటౌట్‌) అద్భుత పోరాట పటిమ ప్రదర్శించాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌లో ఒకరైనా కొద్దిగా అండగా నిలిస్తే జట్టును మరింత మెరుగైన స్థితిలో నిలిపేవాడే. ఇక తన అజేయ ఇన్నింగ్స్‌లో సుందర్‌ క్లాస్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి వికెట్‌పైనైనా బేజారెత్తాల్సిన పని లేదని నిరూపించాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్‌ శైలిని మార్చుకుంటే సునాయాసంగా రన్స్‌ రాబట్టవచ్చని చాటాడు. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో అతడు ఆడిన కవర్‌ డ్రైవ్‌ గంగూలీ, డేవిడ్‌ గోవర్‌లను గుర్తు చేసింది. ఆ బౌండరీతో ఖాతా తెరిచిన వాషింగ్టన్‌ ఆపై మరెన్నో సుందరమైన షాట్లతో అలరించాడు. మన టాపార్డర్‌ను బెంబేలెత్తించిన ఆఫ్‌ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ బౌలింగ్‌లో కొట్టిన రెండు ఫోర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. స్క్వేర్‌ డ్రైవ్‌, బ్యాక్‌ఫుట్‌ కట్‌తో వావ్‌..అనిపించాడు. ఇంకా బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌ డ్రైవ్‌, లీచ్‌ బౌలింగ్‌లో కవర్‌ డ్రైవ్‌ అతడి కళాత్మక ఇన్నింగ్స్‌కు అద్దంపట్టాయి. దాదాపు 30 ఓవర్లు ఆడిన సుందర్‌-అశ్విన్‌ జోడీ ఎండ, ఉక్కపోతలో ఇంగ్లండ్‌ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అంతేకాదు వీరి భాగస్వామ్యం ఇంగ్లండ్‌ కెప్టెన్‌.. కోహ్లీ సేనను ఫాలోఆన్‌ ఆడించకూడదన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది.

Updated Date - 2021-02-09T04:03:37+05:30 IST