షమీపై ఆన్‌లైన్ దాడిని ఖండించిన సెహ్వాగ్

ABN , First Publish Date - 2021-10-26T00:00:40+05:30 IST

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై జరుగుతున్న ఆన్‌లైన్ దాడిని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా

షమీపై ఆన్‌లైన్ దాడిని ఖండించిన సెహ్వాగ్

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై జరుగుతున్న ఆన్‌లైన్ దాడిని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా ఖండించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు దారుణంగా ఓటమి పాలైంది. అయితే, పరాజయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు షమీ కారణంగా జట్టు ఓడిందంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు వేసిన షమీ ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టు ఓటమికి అతడు ఇచ్చిన పరుగులే కారణమంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. 


కొందరైతే భారత జట్టులోనూ ఓ పాకిస్థానీ ఉన్నాడని అంటే, మరికొందరేమో ఇక రిటైర్మెంట్ తీసుకుని పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ ట్రోల్ చేస్తున్నారు. షమీపై జరుగుతున్న ఈ దారుణ ట్రోలింగుపై టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.


షమీని ట్రోల్ చేస్తున్న వారిని ‘ఆన్‌లైన్ మాబ్’గా అభివర్ణించిన సెహ్వాగ్.. ఈ ట్రోలింగ్ తనను షాకింగ్‌కు గురిచేసిందని, తాము అతడికి అండగా ఉంటామని అన్నాడు. అతడో చాంపియన్ అని కొనియాడాడు. ఇండియా క్యాప్‌ను ధరించిన ఎవరి హృదయాల్లోలైనా ‘ఆన్‌లైన్ మాబ్’ కంటే ఎక్కువగానే ఇండియా ఉంటుందని తేల్చి చెప్పాడు. షమీ తానేంటో తర్వాతి మ్యాచ్‌లో చూపిస్తాడని అన్నాడు. 


షమీపై జరుగుతున్న ట్రోలింగ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లకు తాను కూడా ప్రాతినిధ్యం వహించానని, ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశాడు. అయినా అప్పుడెవరూ పాకిస్థాన్ వెళ్లిపోవాలని అనలేదని పేర్కొన్నాడు. 

Updated Date - 2021-10-26T00:00:40+05:30 IST