అయ్యర్ జట్టులో ఉండాలంటే దానికి సిద్ధంగా ఉండు: మంజ్రేకర్

ABN , First Publish Date - 2021-03-22T05:01:12+05:30 IST

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన శ్రేయాస్ అయ్యర్‌కు టీమిండియాలో మాత్రం టాప్ ప్లేస్ దక్కడం లేదు. చాలా సార్లు 3, 4 స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేసిన అయ్యర్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లలో..

అయ్యర్ జట్టులో ఉండాలంటే దానికి సిద్ధంగా ఉండు: మంజ్రేకర్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన శ్రేయాస్ అయ్యర్‌కు టీమిండియాలో మాత్రం టాప్ ప్లేస్ దక్కడం లేదు. చాలా సార్లు 3, 4 స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేసిన అయ్యర్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లలో మాత్రం 5, 6 స్థానాలకే పరిమితమవుతున్నాడు. ఈ క్రమంలోనే కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. అయ్యర్‌కు ఓ సలహా ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా టాపార్డర్ పూర్తి ఫాంలో ఉందని, అందువల్ల అయ్యర్ ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. టీమిండియాలో కొనసాగాలంటే అయ్యర్‌కు అదొక్కటే దారని, కాదని ఏదైనా ఓ స్థానానికి పరిమితమైతే జట్టులో స్థానం గల్లంతయ్యే అవకాశం ఉందని అన్నాడు.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంజ్రేకర్ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై స్పందించాడు. ‘టీమిండియా అవసరాలకు అనుగుణంగా అయ్యర్ ఆడాలి. అతడికి వేరే మార్గం లేదు. నీళ్లలో పడిన వాడికి ఈదడం లేదా మునగడం తప్ప మరో దారి లేనట్లే అయ్యర్ కూడా జట్టులో ఉండాలంటే ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాల’ని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక టీమిండియా కూడా అయ్యర్ లాంటి మేటి ఆటగాడిని సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ అతడిని దింపితే అది అతడి ఆటతీరుతో పాటు జట్టుపై కూడా ప్రభావం పడుతుందని అన్నాడు. ఓపెనింగ్ కూడా చేయగల సత్తా ఉన్న అయ్యర్‌ను లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపడం సమంజసం కాదని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

Updated Date - 2021-03-22T05:01:12+05:30 IST