షమీకి పెరుగుతున్న అండ.. నేనున్నానన్న సచిన్
ABN , First Publish Date - 2021-10-26T01:47:00+05:30 IST
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత పేసర్

ముంబై: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత పేసర్ మహమ్మద్ షమీపై ఆన్లైన్లో దాడి మొదలైంది. షమీ బౌలింగ్ దారుణంగా ఉందని, అతడిచ్చిన పరుగుల వల్లే భారత జట్టు ఓటమి పాలైందని అభిమానులు విరుచుకుపడ్డారు. భారత జట్టులోనూ ఓ పాకిస్థానీ ఉన్నాడని, షమీ వెంటనే ఆ దేశానికి వెళ్లిపోవాలంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగును ఇప్పటికే ఖండించిన పలువురు మాజీ క్రికెటర్లు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. షమీపై ట్రోలింగ్ తనను ఎంతగానో బాధించిందని మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రోలింగ్ చేస్తున్న వారిని ‘ఆన్లైన్ మాబ్’గా అభివర్ణించాడు. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇలాగే స్పందించాడు. షమీకి అండగా నిలిచాడు.
తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా పేసర్‌కు అండగా నిలుస్తూ ట్వీట్ చేశాడు. తాను షమీకి అండగా ఉంటానని స్పష్టం చేశాడు. షమీ ఒక అంకితభావం కలిగిన ఆటగాడని, ప్రపంచస్థాయి బౌలర్ అని కొనియాడాడు. టీమిండియాకు మద్దతు ఇస్తున్నామంటే దానర్థం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఆటగాడికి అని సచిన్ పేర్కొన్నాడు.