నన్ను తొలగించేందుకు చాలా ప్రయత్నాలు జరగాయి: రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-11T01:20:05+05:30 IST

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి అండ్

నన్ను తొలగించేందుకు చాలా ప్రయత్నాలు జరగాయి: రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

ముంబై: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి అండ్ కో పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత భారత క్రికెట్‌లో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. కోచ్‌గా దిగ్గజ ఆటగాడు ద్రావిడ్ బాధ్యతలు స్వీకరించాడు. టీ20, వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వచ్చాడు. తాజాగా, ఓ జాతీయ పత్రికతో మాట్లాడిన రవిశాస్త్రి.. 2017లో టీమిండియా కోచ్ పదవి నుంచి తనను సాగనంపేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించాడు. 


రవి తొలుత 2014 నుంచి 2015 ప్రపంచకప్ ముగిసేంత వరకు భారత జట్టు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే అకస్మాత్తుగా కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో 2017లో రవిశాస్త్రి కోచ్‌గా జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ వరకు సేవలు అందించాడు.

 

‘‘ఓ పెద్ద వివాదం తర్వాత రెండో విడత బాధ్యతలు చేపట్టాను. అయితే, నన్ను ఈ పదవికి దూరం చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అందుకోసం వారు ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. సరిగ్గా 9 నెలల తర్వాత ఆ వ్యక్తిని నాపై ప్రయోగించారు. అయితే, ఈ విషయంలో నేను ఎవరినీ (బీసీసీఐ)ని వేలెత్తి చూపడం లేదు. ఓ వ్యక్తికి నేను హెడ్ కోచ్‌గా కొనసాగడం ఇష్టం లేక ఇలా చేశారు. హెడ్ కోచ్ పదవికి దూరంగా ఉంచేందుకు గట్టి ప్రయత్నమైతే జరిగిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.


2019 ప్రపంచకప్‌లో ముగ్గురు వికెట్ కీపర్లను సెలక్టర్లు ఎంపిక చేయడాన్ని తాను వ్యతిరేకించినట్టు రవి చెప్పాడు. అలాగే, నాలుగో స్థానంలో ఆడతాడనుకున్న అంబటి రాయుడిని పక్కన పెట్టిన విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ కోచ్ స్పష్టం  చేశాడు. 

Updated Date - 2021-12-11T01:20:05+05:30 IST